పేకాట...కొన్ని లక్షల మందిని నట్టేట ముంచిన వ్యసనం. అలా వచ్చినట్టే అనిపిస్తాయి కానీ ఇలా పెద్దమొత్తంలో డబ్బు చేజారిపోతుంది. చివరికి ఆస్తులు అమ్ముకునే వరకు కూడా వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దీన్ని పూర్తిగా నిషేధించారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా... ఎవరు పరిచయం ఉన్నా సరే పేకాట ఆడుతూ దొరికితే పోలీసులు వదలడంలేదు. ఎవరి పేరు చెప్పినా విడిచిపెట్టడంలేదు. బరాబర్ కేసు బనాయించి మరీ బొక్కలో పడేస్తున్నారు. దీంతో పేకాట రాయుళ్లకు సీక్వెన్స్‌ కుదరని ఆటగాడిలా గిలగిల కొట్టుకుంటున్నారు. ఎక్కడికెళ్లి ముక్క వేయాలో అర్ధం కాని పేకాట పాపారావులు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. 


ఇలాంటి వాళ్ల కోసమే ఓ ముఠా సరికొత్త ప్లాన్ చెప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ గ్యాంగ్ తిరుగుతూ పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకొని పక్కకు తీసుకెళ్లి గుండు కొట్టి పంపిస్తున్నారు. గడ్చిరోలి చంద్రాపూర్ జిల్లాలో జరుగుతున్న పేకాట దందా కోసం భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాకి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని దుబ్బపల్లి, నందిగాం, అంకిసా, నిర్మల్ జిల్లా సరిహద్దులోని ధర్మాబాద్, బాసర సమీపంలోని నవీపేటలోనూ పేకాట జోరుగా నడుస్తోంది. అనేకమంది పుర ప్రముఖులు ఇక్కడకు చేరి తమ కార్డు నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. 


అయితే ఇక్కడే ఉంది అసలు వింత. వారంతా స్థానికంగా మాత్రం సమాజంలో మంచి పేరున్న వారు. వారికి పోలీస్ స్టేషన్ అంటే జీవితంలో దాదాపుగా ఎరిగి ఉండరు. కానీ ఈ బలహీనత వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పేకాట ఆడాలన్నా కూడా వారికి సరైన స్థలం దొరకడం లేదు. ఇదే బ్రోకర్లకు మంచి అవకాశంగా మారింది. వారికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలను రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న క్లబ్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే ఇంటికి వెళ్ళకుండా ఉండేలా లాడ్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఇటువంటి క్లబ్ నిర్వాహకులు. వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్‌తోపాటు వారికి కావాల్సిన దేశీ, విదేశీ లిక్కర్ సైతం సరఫరా చేస్తున్నారు. దీంతో పేకాట ఆడుతూ ఇటు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు పేకాట పాపారావులు.


ఆస్తులు తాకట్టు- బంగారం గాయబ్ 


ఇక్కడ ఉన్న సకల సౌకర్యాలతోపాటు ఒకవేళ ఆటలో డబ్బులు పోగొట్టుకుంటే మాత్రం తర్వాత ఏం చేయాలి అనే దానికి కూడా ప్లాన్ బీ రెడీగా ఉంది. ఒంటిమీద బంగారంతోపాటు తెచ్చుకున్న బండిని సైతం తాకట్టు పెట్టుకుని మరీ అప్పు ఇవ్వడానికి ఇక్కడ టెంపరరీ బేస్లో వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలువురు పేకాట ప్రియులు గుంపులుగా పలు వెహికల్స్‌లో టూరిస్ట్‌ల్లాగా వెళ్లి ఈ స్థావరాల్లో నిర్భయంగా రోజుల తరబడి ఆడుతూ ఇల్లు గుల్ల చేస్తున్నారు.


ఎందుకు ఈ పరిస్థితి???


నిజానికి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం నేరుగా డబ్బులతో ఎలాంటి ఆటలు ఆడినా అవి నిషేధిత కోవలోకి వస్తాయి. అయితే గోవా లోనూ మహారాష్ట్ర లోనూ పేకాటలోని రమ్మీ ఆటని మైండ్ గేమ్‌గా మాత్రమే భావిస్తారు. అందుకే మహారాష్ట్ర బార్డర్‌లో ఉన్న అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న ఈ క్లబ్‌లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆటగాళ్లు వెళ్లి వాళ్ళ లక్ చెక్ చేసుకుంటున్నారు.