హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం అనంతరం తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని.. కేసీఆర్ అహంకారం, డబ్బు, మద్యం సీసాలను తిప్పికొట్టారని అన్నారు. ప్రజలంతా ఏకమై కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారని అన్నారు. తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ప్రజల రుణం తీర్చుకోలేనని వ్యాక్యానించారు. తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని.. అమిత్ షా తనకు అండగా ఉంటానన్నారని గుర్తు చేశారు. అమిత్ షా, జేపీ నడ్డాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తన గెలుపును ప్రజలకు అంకితం చేస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా టీంకు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలని అన్నారు. హుజూరాబాద్‌లో గెలుపుతో రాష్ట్రంలో ప్రజలు నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. తన లాంటి కష్టం పగ వాడికి కూడా రావొద్దని ఈటల అన్నారు. వ్యాపారాలు వదులుకుని మరీ తన భార్యతో సహా అందరం ఎన్నికల కోసం తిరిగామని చెప్పారు. కుట్రదారులు ఎప్పటికైనా కుట్రల్లోనే పోతారని అన్నారు. తన చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదని.. మోసం చేసింది.. వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లగొట్టింది కేసీఆరే అని అన్నారు.
‘‘ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ప్రలోభాలతో కూడిన ఎన్నిక ఎక్కడా జరగలేదు. హుజురాబాద్ ప్రజలు గుండెను చీల్చి, తమ ఆత్మను ఆవిష్కరించి నన్ను గెలిపించారు. నా చర్మం ఒలిచి, వాళ్ళకి చెప్పులు కుట్టించినా... నేను వారి రుణం తీర్చుకోలేను. కులాల పరంగా చీలిక తెచ్చినా.. అనేక ప్రలోభాలకు గురిచేసినా.. హుజురాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని, భారీ విజయాన్ని అందించారు. నన్ను టీఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిన తర్వాత బీజేపీ నాయకులు అక్కున చేర్చుకున్నారు. నా గెలుపుకోసం వందలాదిమంది కనపడకుండా కూడా పని చేశారు. హుజురాబాద్‌లో ఈటల గెలవడం అంటే.. అందరూ గెలిచినట్టేనని వివిధ వర్గాల వారు, ఉద్యోగులు భావించారు. ఎప్పుడూ బయటికి రాని దత్తాత్రేయ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు.
ఓయూ, కేయూతో పాటు ఎందరో విద్యార్థులు నాకు సహకరించారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కుయుక్తులను చీల్చి చెండాడారు. ప్రపంచంలోని తెలుగు వారంతా కూడా నా గెలుపును కోరుకున్నారు. నిజంగా దీపావళి ఈనెల 4న అయితే నా గెలుపు తో ప్రజలంతా నిన్ననే దీపావళి చేసుకున్నారు. గతంలో నాకు వచ్చిన ఓట్లకంటే ఈసారి ఎక్కువే ఓట్లు సాధించాను. గతంలో తన గుర్తుతో గెలిచానన్న కేసీఆర్‌కు.. ఇప్పుడు నా గుర్తుతో(బీజేపీ) గెలిచి... కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.
పని చేయని దళితబంధు కింద రూ.10 లక్షలు
‘‘పదిసార్లు ఇచ్చినా నిన్ను మర్చిపోమని మా దళిత ప్రజలు నాకు అండగా ఉంటామని నిలబడ్డారు. కేసీఆర్ తన అకృత్యాలతో నాకు ఒక్క ఓటు కూడా పడొద్దని ప్రయత్నించి, పూర్తిగా విఫలమయ్యాడు. పోలీసులే ఎస్కార్ ఇచ్చి డబ్బుల పంపిణీ చేయించారు. నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు. కళ్ళముందు లక్షలు కనిపించినా.. అవన్నీ తిరస్కరించి అన్ని కులసంఘాల వారు నన్ను గెలిపించేందుకు సహకరించారు. తెల్ల బట్టలో పసుపు బియ్యం పట్టుకుని ఓట్లు టీఆర్ఎస్‌కే వేయాలని, నన్ను ఓడగొట్టాలని ప్రజలను బెదిరించారు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడు. నన్ను ఓడించడానికి ఇక్కడికి వచ్చిన వారి భరతం పట్టుడు ఖాయం. పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.’’ అని ఈటల రాజేందర్ మాట్లాడారు.