Telangana Earthquake: తెలంగాణ జిల్లాలోని కరీంనగర్‌లో భూమి కంపించింది. క్షణం పాటు భూమి కంపించడంతో ప్రజలంతా వణికిపోయారు. బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక అంతా కేకలు పెట్టారు. ఇళ్ల నుంచి బయటకు గట్టిగట్టిగా అరుస్తూ బయటకు వచ్చేశారు. భూమి కంపించడంతో ఇంట్లో వస్తువులు కూడా కిందపడిపోయాయి. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్ జిల్లాతోపాటు నిర్మల్,మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

జగిత్యాల జిల్లాలో కూడా భూకంపనలు వచ్చాయి. మెట్పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో స్వల్ప భూకంపనలు సంభవించాయి. సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూమి ఊగినట్లు అనిపించడంతో చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు

గత ఏడాది డిసెంబర్‌లో కూడా కరీంనగర్‌లో భూమి స్వల్పంగా భూమి కంపించింది. డిసెంబర్ మూడు, నాలుగు తేదీల్లో ఈ ఘటన జరిగింది. నాల్గో తేదీన తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. పదేళ్లలో కరీంనగర్‌ పరిసరాల్లో ఏర్పడిన భూప్రకంపనల్లో ఇది ఒకటి. 

2021 అక్టోబర్‌ 23న రిక్టార్ స్కేల్‌పై 4.0తీవ్రతో భూకంపం ఏర్పడింది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పడింది. దీని వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదు. ప్రజల్లో భయాందోళన నెలకొంది. 

అంతకు ముందు అంటే 2020 ఏప్రిల్ 24న రిక్టార్ స్కేలుపై 4.8 తీవ్రతతో కరీంనగర్‌కు ఉత్తర ఈశాన్యంగా 119కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు ఏర్పడ్డాయి. తెలంగాణ భూకంపాల జోన్‌ 2లో ఉంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలవకు గురయ్యే ప్రాంతంగా పరిగణిస్తారు. భూగర్భంలో ఫాల్ట్‌ లైన్స్‌ కారణంగా అప్పుడప్పుడు భూప్రకంపనలు సంభవించే ఛాన్స్‌ ఉంది.