Telangana News: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం రేపిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ టైంలో రాష్ట్రంలో జీవన్ రెడ్డి హడావుడి చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో జోక్యం చేసుకున్న అధినాయకత్వం ఆయన్ని ఢిల్లీకి పిలిచింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారా ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కబురు పెట్టారు.
కనీస సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పదేళ్లుగా జగిత్యాలలో తాను సంజయ్ కుమార్ పై పోరాడుతూంటే.. తనకు తెలియకుండా ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పారని అసంతృప్తితో ఉన్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు. అయినా వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి జూన్ 25న హైదరాబాద్ వచ్చారు.
తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసి వ్యవసాయం చేసుకుంటానని ఆయన అంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని చైర్మన్ కు ఫోన్ ద్వారా జీవన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ చైర్మన్ నల్గొండ జిల్లా టూర్ లో ఉండడంతో జూన్ 26 రాజీనామా లేఖ ఇవ్వాలని జీవన్‌రెడ్డి డి సైడ్ అయ్యారు. ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో జీవన్ రెడ్డి, విప్ అడ్లూరితో కలిసి ఢిల్లీ వెళ్లారు.
చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పీసీసీ నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్లుగా తెలుస్తోది. చేరికలతో పార్టీకి బలం పెరగాలి తప్ప, కొత్త సమస్యలు రావద్దని రాష్ట్ర నేతలకు సూచించారు. చేరికల సమయంలో సంబంధిత నియోజకవర్గాల నేతలకు సమాచారం ఇవ్వాలని చేరికలపై పీసీసీ నాయకత్వానికి హై కమాండ్ దిశా నిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేత. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆయన ఆ గాలిలో గెలవలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. నిజామాబాద్ పార్లమెంట్ సీటు ఇచ్చినా గెలవలేదు. తన సీనియార్టీని గుర్తించి.. మంత్రి పదవి ఇస్తారని అనుకున్నా ప్రయోజనం లేకపోవడంతో పాటు.. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడంతో ఆయన ఫీలయ్యారు.