Ponnam Prabhakar challenges Bandi Sanjay and Vinodkumar : 
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లకు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఎంపీగా నియోజకవర్గానికి మీరేం చేశారు, కాంగ్రెస్ హయాంలో తాను ఏం చేశానో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మను పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకొని తొమ్మిదేళ్లు గడుస్తున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరిందో లేదో గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 


100 ఏళ్లకు సరిపడా సంపాదించిన కేసీఆర్ ఫ్యామిలీ! 
దశాబ్ద కాలంలో వందేళ్లు బతకడానికి సరిపోయేంత ఆస్తులను సీఎం కేసీఆర్ కుటుంబం సంపాదించుకుందని ఆరోపించారు. తెలంగాణ విభజన అప్పుడు ఉన్నటువంటి 60 వేల కోట్ల అప్పు, ఇప్పుడు ఆరు లక్షల కోట్లకు చేరి ప్రజలకు భారంగా మారిందే తప్ప, తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడి లాగానే ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అంటే ట్యాంక్ బండ్లు, రోడ్డు డివైడర్లు, స్ట్రీట్ లైట్లు తప్ప మరేమీ లేవని ఎద్దేవా చేశారు.


అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాటకు దిగారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గొడవ జరిగింది.


కులం పేరుతో దూషించడంతో గొడవ!
బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో  రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఓ నేతను వేదికపైకి పిలిచే సమయంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేదికపైకి వెళ్లే సమయంలో ఓ నేతను కులం పేరుతో ప్రత్యర్థి వర్గానికి చెందిన మరొకరు దూషించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగానే గొడవ జరిగినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.