CM KCR Kondagattu Tour: జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా అందించారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, కొండలరాయుడి గుట్ట, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం తదితర స్థలాలను పరిశీలించారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు (CM KCR Kondagattu Tour) సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకి తొలుత వెళ్లారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు.
విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. దేవాలయ అభివృద్ధిపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వామివారి దర్శనం తర్వాత జేఎన్టీయూ మీటింగ్ హాలులో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై సమాలోచనలు జరిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అన్నారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని.. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు.
‘‘సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కొండగట్టుకు (CM KCR in Kondagattu) మొత్తం రూ.600 కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ డెవలప్ మెంట్ కోసం నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిశాక ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కొండగట్టుకు అదనంగా ఇంకో రూ.500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే బడ్జెట్‌లో కొండగట్టు కోసం రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన మరో రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.600 కోట్లను కొండగట్టు ఆలయ డెవలప్ మెంట్ కోసం వెచ్చించనున్నారు.