KCR Jagtial Visit: జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయింది. రేపు అంటే డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ జగిత్యాల్ కు రాబోతున్నారు. ఉదయం 11 గటలకు హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకునే అవకాశం ఉంది. మొదట జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మొదట 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా రోడ్డు మార్గాన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం మోతే రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 


అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు..


బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ,కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు పయనం కాబోతున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షిస్తున్నారు. జగిత్యాల, ధర్మపురి కోర్టులతో పాటు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గల నుండి జనాల్ని సమీకరిస్తున్నారు. సుమారు ఐదు జిల్లాల నుండి 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో 2,325 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎడుగురు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ముగ్గురు మహిళా సీఐలు, 165  ఎస్ఐలు, 13 మంది మహిళా ఎస్సైలు ఉండనున్నారు.


ఇటీవలే పాలమూరు పర్యటనలో సీఎం కేసీఆర్..


తెలంగాణ సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. డిసెంబర్ 4వ తేదీన మహహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి స‌మీపంలో పాల‌కొండ వ‌ద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంతకు ముందు కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రావ్‌ను సీట్‌లో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు పాల్గొన్నారు.