BRS Chief KCR News: రామగుండం: తాను చేపట్టిన బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను, తనను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్యయ్యాయని.. అందులో భాగంగానే తన ప్రచారంపై నిషేధం విధించారని కేసీఆర్ పేర్కొన్నారు. 48 గంటల నిషేధం పూర్తయిన తర్వాత తన గొంతు ప్రజలకు వినిపిస్తున్నా అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.
ఏం చేశానని నా గొంతును ఆపారు?
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. రెండు గంటల ముందే ఇక్కడికి వచ్చిన, కానీ బ్యాన్ ఉంది కాబట్టి రా.8.15 తర్వాత బయటికి వచ్చిన అంటూ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధం, కానీ దేవుడి బొమ్మలు నెత్తి మీద పెట్టుకుని అమిత్ షా మాట్లాడుతున్నడు, అది ఎలక్షన్ కమిషన్‌కు కనిపించదా అని కేసీఆర్ అడిగారు. తాను ఏం చేశానని నిషేధం విధించారని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నించారు.
పదేళ్ల మోదీ పాలనలో దేశం ఆగమైంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అయ్యిందా? అని ప్రశ్నించారు. డాలర్‌తో రూపాయి విలువ రూ.84కు పడిపోయింది. ఓవైపు దేశం అప్పులపాలు కాగా, మరోవైపు కంపెనీలు మాయం అయ్యాయని ఎద్దేవా చేశారు. సింగరేణి, రైల్వే లాంటి సంస్థను, బ్యాంకులు, ఎల్ఐసీని కూడా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ పాలనలో మతవిద్వేషం.. హింస చెలరేగుతోందని, బేటీ బచావో.. బేటీ పడావో అయ్యిందా? ఒకప్పుడు నేషనలైజేషన్.. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటున్నారని కేంద్రాన్ని నిలదీశారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే?
ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, బీజేపీకి 200 సీట్ల కన్నా ఎక్కువ రావని వార్తలు వస్తున్నాయని.. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిస్తే కీలక పాత్ర పోషిస్తది అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలుపే ప్రజల గెలుపు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. మోసకారి కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు, పైగా గత ప్రభుత్వ ఆర్డర్ల బిల్లులు చెల్లించడం లేదు అందుకే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు అని కేసీఆర్ ఆరోపించారు. ఐదు నెలల కిందటికి, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారాయి? పెద్దపల్లి జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా పొలాలు ఎండిపోయాయని, దీనికి కారణం ఎవరు అని కేసీఆర్ ప్రశ్నించారు. గత పదేళ్లలో పొలాలు ఎండినయా? ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు.
పదేళ్లలో కరెంటు కోతలు లేవు, ఇప్పుడు కరెంటు కోతలు ఎవరు పెట్టారు? రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా? అని ప్రశ్నించారు. రైతులకు రూ.1200 కూలీ, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నరా? ఆగస్టు 15 లోపు రుణమాఫీ అంటున్నరు. నిరుద్యోగ భృతి ఎగబెట్టారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోదా? 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చినం, దళితులకు విడుదల చేసిన నిధులను రేవంత్ వెనక్కి తీసుకున్నడు అని కేసీఆర్ ఆరోపించారు.
రేవంత్ స్విట్జర్లాండ్‌లో ఒప్పందం
మోదీ, రేవంత్ కలిసి సింగరేణిని ఖతం చేస్తారు. అదానీ దోపిడీకి రేవంత్ స్విట్జర్లాండ్‌లో ఒప్పందం చేసుకున్నడు, కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే తాను కూడా ఏం చేయలేను అన్నారు. అదానీని అందుకే తెలంగాణకు ఆహ్వానించారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో సింగరేణి గనులు పెట్టాలని మేం ప్రయత్నించినం కానీ సింగరేణిని అదానీకి అప్పగిస్తే కార్మికుల నోట్లో మట్టి కొట్టినట్టే అని, ఇది చాలా ప్రమాదకరం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోదీ అండదండలతో అదానీ రూ.14 లక్షల కోట్లకు ఎదిగాడు. అదానీ బొగ్గు కొనాలని మోదీ ఒత్తిడి తెచ్చాడు. ప్రాణం పోయినా ఆ బొగ్గు తీసుకునేది లేదని, సింగరేణి బొగ్గు వాడుకుంటామని చెప్పినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.