TS ECET 2024 Halltickets: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2024 (TS ECET Hall Tickets) పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6న టీఎస్ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసెట్ పరీక్ష కోసం మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రిజీయన్‌లో 44, ఏపీలో 7 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు హాజరుకానున్నారు.
TS ECET 2024 Halltickets Download
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులను 'ఒక్క నిమిషం' ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
➥ అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ ఉంటేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు.
➥ హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు, కాలేజీ ఐడీ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ సెల్ ఫోన్లు, క్యాలికులేటర్స్, లాగ్ టేబుల్స్, డిజిటల్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు).
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆలస్యరుసుములో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అవసరమైన వివరాలు సమర్పించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్‌ను ఈసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష తేదీ..
➥ ఈసెట్ పరీక్ష తేది: 06.05.2024.
➥ పరీక్ష సమయం: ఉ. 09:00 - మ.12:00 (ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM)