Sonali Bendre About Producers: సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది నటి సోనాలి బింద్రే. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలన్నీ అద్భుత విజయాలను అందుకున్నాయి. బాలీవుడ్ లోనూ తను నటించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత  పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరం అయ్యింది. అయినప్పటికీ పలు టీవీ షోస్ లో కనిపిస్తూనే ఉంది.


సెకెంగ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సోనాలి


చాలా గ్యాప్ తర్వాత సోనాలి బింద్రే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ సీజన్‌ 2 తో ఆడియెన్స్ ను అలరించింది. తాజాగా జీ5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మీడియా సంస్థలు చూపించే వార్తల్లో వాస్తవం ఎంత ఉంది? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి కీలక విషయాలు వెల్లడించింది. హీరోయిన్లపై పుట్టించే రూమర్లు మొదలుకొని, తనపై చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వరకు ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటంటే?


నిర్మాతలు నా బాడీ గురించి వంకర కామెంట్లు చేసేవాళ్లు


ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా మంది నిర్మాతలు బాడీ షేమింగ్ చేశారని సోనాలి వెల్లడించింది. “నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌డు చాలా స‌న్న‌గా ఉండేదాన్ని. చాలా మంది నిర్మాత‌లు న‌న్ను బాడీ షేమింగ్ చేసేవాళ్లు. నాపై జోకులు వేసుకుని నవ్వేవాళ్లు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హీరోయిన్లంతా కాస్త బొద్దుగా ఉండేవాళ్లు. న‌న్ను కూడా అలా ఉండాలని చెప్పవాళ్లు. నా బాడీలో షేపులు కోరుకునే వాళ్లు. కానీ, వారి మాటలను నేను పట్టించుకోలేదు. నేను ఎలా ఉన్నానో, అలాగే ఉండాలి అనుకున్నాను. అభిమానులు నన్ను ఆదరించారు. స్టార్ హీరోయిన్ ను చేశారు” అని చెప్పుకొచ్చింది.


నిర్మాతలే పుకార్లు పుట్టించే వాళ్లు  


ఇప్పటికే పోల్చితే ఒకప్పుడు సినిమా పరిశ్రమలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని సోనాలి వివరించింది. “సినిమా పరిశ్రమ ఇప్పటితో పోల్చితే అప్పట్లో చాలా డిఫరెంట్ గా ఉండేది. నా తోటి నటులతో నిర్మాతలే సంబంధాలు అంటగట్టేవాళ్లు. వాటిలో ఏమాత్రం వాస్తవం ఉండేది కాదు. సినిమా ప్రమోషన్ కోసమే ఫేక్ రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లు. మీడియాకు వాళ్లే లీకులు ఇచ్చేవాళ్లు. ఇలాంటి పనిమాలిన ట్రెండ్ ఇప్పటికీ సినిమా పరిశ్రమలో ఉంది. అప్పట్లో ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కానీ, ఆ తర్వాత విషయం అర్థం అయ్యింది” అని వివరించింది.  


Read Also: పేద రైతులకు ఫ్రీగా ట్రాక్టర్లు, మాట నిలబెట్టుకున్న లారెన్స్, నిజంగా మీరు దేవుడు సామీ!