Raghava Lawrence Help: రాఘవ లారెన్స్. మంచి మనసున్న సినీ స్టార్. కొరియోగ్రాఫర్ గా, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అనాథలు, వికలాంగులతో పాటు ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. సాయం కోరి వచ్చిన వారిని లేదనకుండా ఆదుకుంటున్నారు. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి చేయూతనందిస్తున్నారు. కొద్ది రోజు క్రితమే పలువురు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించారు. మరో 10 మంది దివ్యాంగులకు ఇండ్లు కట్టించి అందించారు. ఎంతో మంది అనాథలను ఒక్కచోటకు చేర్చి, ఆనాథాశ్రమాలను నిర్వహిస్తున్నారు లారెన్స్. హీరోగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు.
పేద రైతుకు ట్రాక్టర్ అందించిన లారెన్స్
తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు లారెన్స్. ఓ పేద రైతుకు ట్రాక్టర్ బహుమతిగా అందించారు. తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి ఈ ట్రాక్టర్ ను అందించారు. అతడు తన చెల్లి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న లారెన్స్ రాజకన్నన్ కు ట్రాక్టర్ ను బహుమతిగా అందించారు. ఆ రైతు కళ్లల్లో ఆనందం చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "మిత్రులు, అభిమానులకు నమస్కారం. గతంలో నేను చెప్పినట్టుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 10 మంది రైతులకు ట్రాక్టర్లు అందజేస్తాను. అందులో భాగంగా తొలి ట్రాక్టర్ ను విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన చెల్లి భర్త చనిపోవడంతో తన కుటుంబంతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా తనే పోషిస్తున్నారు. తను కొత్త ట్రాక్టర్ ను నడుపుతూ నవ్వే ముఖాన్ని చూడాలని వ్యక్తిగతంగా కోరుకున్నాను. అందుకే అతడి కుటుంబాన్ని పిలిచి ట్రాక్టర్ ను అందించాం. అందరం కలిసి రైతులకు అండగా నిలుద్దాం” అని రాసుకొచ్చారు.
10 మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందిస్తానని చెప్పిన లారెన్స్
లారెన్స్ కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా 10 మంది పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నేరవేరుస్తున్నారు లారెన్స్. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లారెన్స్ నిస్వార్థ సేవ పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి గొప్ప మనుషుల పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
ఓవైపు సేవా కార్యక్రమాల్లో ముందుంటూనే,మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నారు లారెన్స్. ఆయన ప్రస్తుతం ‘బెంజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాను బక్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథను అందిస్తున్నారు.
Read Also: ‘పుష్ప 2‘ సాంగ్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్, స్పందించిన అల్లు అర్జున్ - నెటిజన్లకు ఫుల్ ఫన్