Telangana News: కరీంనగర్‌లో రాజకీయాలు చాలా హాట్‌హాట్‌గా మార్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టనున్న రైతు దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఈ పరిస్థితి కారణం కావచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ విమర్శలు చేయనున్నారు.
ఈ మధ్య కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బండి సంజయ్ దీక్షకు సిద్ధమయ్యారు. రైతు దీక్ష పేరుతో కలెక్టరేట్ వద్ద దీక్ష చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల టైం కావడంతో అనుమతి ఇవ్వలేం అని తేల్చేశారు.
కలెక్టరేట్ వద్ద దీక్షకు అనుమతి లేదని చెప్పడంతో తన కార్యలయంలోనే దీక్ష చేపట్టాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. అక్కడే రైతు దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం రెండు గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. ఈ వైఖరిని నిరసిస్తూ సోమవారం అన్ని ప్రభుత్వాఫీసుల్లో వినతి పత్రాలు అందజేశారు. ఇవాళ దీక్ష చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలన్న డిమాండ్‌తోపాటు మరిన్ని డిమాండ్‌లను ప్రభుత్వం బండి సంజయ్ ముందు ఉంచుతున్నారు.
బండి సంజయ్ చేస్తున్న డిమాండ్లు
ఎలాంటి గ్రేడింగ్ లాంటివి లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తక్షమే కొనుగోలు ప్రారంభించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలి. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. కౌలు రైతులకు 15000 రూపాయల నగదు, కూలీలకు 12000 పరిహారం అందివ్వాలి.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు అందివ్వాలి. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలి. రైతుల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలి. వీటితోపాటు రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లతో బండి సంజయ్ దీక్ష చేపడుతున్నారు.