Bandi Sanjay about Reservation: కరీంనగర్: ‘‘రిజర్వేషన్ల రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా .... ‘‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయబోమని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్న. ఇక్కడున్న ప్రజలంతా దేవుడిమీద ప్రమాణం చేసి రిజర్వేషన్లు రద్దు కావని చెబుతున్నారు. మరి ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భగవంతుడి మీద ప్రమాణం చేసే దమ్ముందా కాంగ్రెస్ నేతలకు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 


దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన బండి సంజయ్ 
బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయబోమని చేతులు చాచి దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే ప్రజలకు గాడిద గుడ్డు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తరువాత మిగిలేది గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పదేపదే గాడిద గుడ్డును చూపిస్తుంటే... కాంగ్రెస్ పార్టీ  గుర్తు హస్తం కాదేమోనని, గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తుగా మార్చుకున్నారేమోననే అనుమానం ప్రజల్లో నెలకొందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మారసుర హస్తంగా మారిందన్నారు. 


దేశ ప్రధానిని నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికలివి. బీజేపీ ప్రధాని అభ్యర్ధి మోదీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? పోనీ కాంగ్రెస్ కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరు? కెప్టెన్ లేకుండా క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎట్లుంటది? కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్.


అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు? అమలు చేయడం లేదని నేను అడుగుతుంటే ‘గాడిద గుడ్డు’ చూపిస్తున్నడు. రేవంతన్న గాడిదగుడ్డు, గుండు సున్నాల మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీలపై ఎందుకు లేదు అని ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో తిరుగుతుంటే ప్రజలు 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తుంటే చర్చను దారి మళ్లించేందుకు గాడిద గుడ్డును తెరమీదకు తెస్తున్నారు అని అంటున్నారు.


హామీలకు బదులు కాంగ్రెస్ గాడిద గుడ్డు! 
మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు  రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఇచ్చారా? గాడిద గుడ్డు ఇచ్చారు. రైతుకూలీలకు రూ.12 వేలు ఇచ్చారా? వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇల్లు లేనోళ్లకు జాగాతోపాటు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. వ్రుద్దులకు, వితంతవులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా? అడిగితే....గాడిద గుడ్డు చూపిస్తున్నారు.రేవంతన్న తీరు చూస్తుంటే... కాంగ్రెస్ గుర్తు గాడిద గుడ్డుగా మారిందా? కాంగ్రెస్ హస్తం గుర్తు ప్రజల నెత్తిన భస్మారసుర హస్తంగా మారిందని గాడిద గుడ్డుగా మార్చారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తూ.చ తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఉన్నత పదవుల్లో ఆయా వర్గాలకే ప్రాధాన్యతనిస్తున్న మోదీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తుండటం సిగ్గు చేటు అన్నారు. బీజేపీని ఓడించడం సాధ్యం కాదని తెలిసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి కాంగ్రెస్ ఈ డ్రామాలాడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు.