Bandi Sanjay Comments in Karimnagar: ‘కొంత మంది దళారులు పీఎం విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా ద్రుష్టికి వచ్చింది. ఖబడ్దార్.. అలాంటి దళారులను ఉపేక్షించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలకు వెనుకాడబోం.’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దళారీ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. ఈరోజు (జూన్ 30) ఉదయం కరీంనగర్ లో పీఎం విశ్వకర్మ యోజన పథకం కోసం దరఖాస్తు చేస్తున్న పలువురు మహిళలు బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
కొంత మంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం లబ్దిదారులుగా ఎంపిక చేస్తామంటూ కొంత మంది దళారులు కమీషన్లు దండుకుంటున్నారంటూ మంత్రి ద్రుష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ ‘‘పీఎం విశ్వకర్మ పేరుతో కమీషన్లు తీసుకుంటే సీరియస్ చర్యలుంటాయి. దళారీ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకం. ఇప్పటికే ఈ అంశం జిల్లా కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినా కొంత మంది స్టాంప్ ఫీజు పేరుతో, లబ్డిదారులను ఎంపిక చేస్తామనే పేరుతో డబ్బులు తీసుకుంటున్నట్లు, కమీషన్లు అడుగుతున్నట్లు మా ద్రుష్టికి వచ్చింది. అట్లాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు.’అని పేర్కొన్నారు.
పీఎం విశ్వకర్మ లబ్దిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ ద్రుష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను దరఖాస్తుదారులకు అర్ధమయ్యేలా వివరించే బాధ్యత కూడా అధికారులకు ఉందన్నారు.