TGPSC Veterinary Assistant Surgeon: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Veterinary Assistant Surgeon) (క్లాస్ ఎ, బి) పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జూన్ 29న విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలును కూడా కమిషన్ ప్రకటించింది. దీనిప్రకారం జులై 4 నుంచి 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:2 నిష్పత్తిలో మొత్తం 314 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ 40 మంది చొప్పున సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు.
నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 10.30 గంటలకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు పరిశీలన జరుగనుంది. ఎంపికైన అభ్యర్థులు జులై 3 నుంచి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేవారు అవసరమైన అన్నిరకాల సర్టిఫికేట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చెక్ లిస్టును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకీ 2022, డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023, జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. జులై 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరిగాయి.
రాతపరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది మార్చిలో కమిషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులకుగాను 786 మందిని, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులకుగాను 101 మంది అభ్యర్థులను జనరల్ ర్యాంకింగ్ జాబితాకు ఎంపికచేసింది. వీరినుంచి 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు 314 మందిని ఎంపిచేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630 జీతంగా ఇస్తారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే వేదిక: Office of the Telangana Public Service Commission,
M.J. Road, Nampally, Hyderabad.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి.
6) డిగ్రీ లేదా డిప్లొమా ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో.
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు EWS సర్టిఫికేట్ అవసరం.
10) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు/ ఎన్‌సీసీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే వయోసడలింపుకు సంబంధించిన తగిన ఆధారాలు కలిగి ఉండాలి.
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి.
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి
13) వెబ్ఆప్షన్లు నమోదుచేసిన అభ్యర్థులను మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనలో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు జూన్ 26 నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
14) నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి.