Telangana News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. హిందూమతం గురించి బండి సంజయ్ కు రాజకీయాలెందుకు, మఠం పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో రిప్లై ఇచ్చారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ మండిపడ్డారు. కేటీఆర్‌కు అధికారం పోయినా ఇంకా అహంకారం తగ్గలేదని... లోక్‌సభ ఎన్నికల్లో నెత్తికెక్కిన కళ్లను కిందకు దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికీ అధికారంలోనే ఉన్నామన్న భ్రమలు కేసీఆర్ కుటుంబానికి పోలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.


కేటీఆర్ వంటి నాస్తికులకు ఎందుకు ఓట్లు వేయాలి? 
రాష్ట్రంలో 99శాతం మంది దేవుడ్ని నమ్మేవాళ్లే ఉన్నారన్న బండి సంజయ్‌... దేవుడంటనే నమ్మకం లేని కేటీఆర్ వంటి నాస్తికులకు జనం ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదాద్రి(YADHADRI) అభివృద్ధి చేశామని గతంలోనే ఈ మూర్ఖుడు చెప్పాడంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు. బంగారు తెలంగాణకు పట్టిన దరిద్రమే కేసీఆర్ (KCR) కుటుంబమన్న సంజయ్... వారి అరాచకాలు, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీ( BJP) యేనని గుర్తు చేశారు. తప్పతాగి కారు నడపడం వల్లే షెడ్డుకుపోయిందని..రిపేర్‌కు కూడా పనికిరాదన్నారు. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితిలో లేరన్నారు.


తెలంగాణలో ఏయే గ్రామానికి కేంద్రం నిధులిచ్చిందో... ఏయే అభివృద్ధి పనులు చేపట్టామో వివరాలను వెల్లడిస్తామని కేటీఆర్‌(KTR) కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎంతెంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ది(Vinod Kumar) అసలు కరీనంగరే కాదని....ఆయన ఏనాడూ కరీంనగర్(Karimnagar) ప్రజలను కలిసింది లేదని బండి సంజయ్‌ చెప్పారు. అలాంటి వారిని ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలపై రుద్దేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. తాను ఎవరిని నిలబెడితే వాళ్లు గెలుస్తారన్న అహంకారంతోనే గత లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ బొక్కబోర్లాపడ్డారని... ఇప్పటికీ ఆ పంథా వీడటం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మళ్లీ తండ్రీకొడుకులు డ్రామాలు ఆడుతున్నారని.... వారి మాటలను తెలంగాణ(TELANAGANA) సమాజం నమ్మే పరిస్థితిలో లేదని బండి సంజయ్ మండిపడ్డారు..ఒక్క ఓటమితోనే బీఆర్ఎస్‌కు అభ్యర్థులు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని.... లోకల్‌గా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎక్కడెక్కడో వాళ్లను తీసుకొచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పదికి పైగా స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తామని బండి సంజయ్ తెలిపారు.


బంగారు తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ ఫ్యామిలీ! 
కేసీఆర్(KCR) కుటుంబం బంగారు తెలంగాణను అప్పులపాలు చేసిందని బండిసంజయ్ మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికసంఘం నిధుల సర్పంచ్‌ల ఖాతాల్లోకి వెళ్లకుండా దారి మళ్లించడం వల్ల ఇప్పటికీ వారు కోట్లాది రూపాయల అప్పుల్లో మునిగిపోయారన్నారు. ఉద్యోగులకు , ఒప్పంద అధ్యాపకులకు సకాలంలో జీతాలే ఇవ్వలేదని సంజయ్ ఆరోపించారు.