బీఆర్‌ఎస్‌ను గద్దె దించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజుతో ముగియనుంది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం 17వ తారీఖున యాత్ర ముగించాల్సి ఉండగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ అడ్డా 16వ తారీఖున ఆకస్మికంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లాల్సి ఉంది. అందుకే రెండు రోజుల ముందే యాత్రను ముగించనున్నారు. 


కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర కళాశాల గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. జాతీయ అధ్యక్షుడితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌, రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలంతా ఈ సభకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సభని సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్ విసిరాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చే ఎన్నికల వరకు మెజారిటీ సీట్లు కొల్లగొట్టాలని ఉద్దేశంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది.


నడ్డా షెడ్యూల్ ఇదీ...


మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ లోని హెలిప్యాడ్ కి చేరుకుంటారు. 3.40 కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుని..4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి 5.35కు బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు..


బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది ఇలా...






గత నెల 28న నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని భైంసా నుంచి యాత్ర ప్రారంభం అయింది. అనేక మలుపుల మధ్య అనుమతి లభించిన తరువాత ప్రారంభమైన యాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 17వ తారీఖున కాకుండా 15 న కరీంనగర్‌లో ముగుస్తోంది. మొత్తం 18 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్ర దాదాపు 200 కిలో మీటర్ల మేర సాగింది. ఐదు  జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగి వివిధ వర్గాల ప్రజలను కలిసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ముఖ్యంగా కొండగట్టు ప్రమాద బాధితులతోపాటు... నారాయణపూర్ ముంపు చెరువు గ్రామాల బాధితులు కూడా ఉన్నారు. యాత్రలో జరిగిన పలువు సభల్లో సమావేశాల్లో బండి సంజయ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూతురు కవిత పాత్రతోపాటు... డ్రగ్స్ కేసులను పలుమార్లు ప్రస్తావించారు. మొత్తానికి ఐదో విడత ప్రజాసంఘాతం యాత్ర ప్రభావం వచ్చే ఎన్నికల వరకు ఎలా ఉంటుందో చూడాలి.