Bandi Sanjay padayatra: బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. జగిత్యాల జిల్లాకు చేరుకున్న ఆ యాత్ర ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుండి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామం వరకు పాదయాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావుతో పాటు పాల్గొన్న పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అలాగే బీజేపీ జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి మదన్మోహన్, నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, డాక్టర్ శైలేందర్ రెడ్డి, వివిధ మోర్చాల నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.


ఉమ్మడి జిల్లాలో ఇదీ షెడ్యూల్...


డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో మొత్తం 21.7 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు. డిసెంబర్ 10వ తేదీన కోరుట్ల పట్టణం వెంకటాపురం, మోహన్ రావు పేట మీదుగా 12.3 కి.మీలు నడిచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో రాత్రి బస చేస్తారు. డిసెంబర్ 11న మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా 10.1 కి.మీలు నడిచి జగిత్యాల రూరల్ మండల కేంద్రంలో రాత్రి బస చేస్తారు. 12వ తేదీన జగిత్యాల పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 10.4 కి.మీలు సాగే ఈ పాదయాత్రలో రాత్రి తారక రామనగర్ లో బస చేస్తారు. డిసెంబర్ 13న తారక రామనగర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా 13.3 కి.మీలు నడిచి కొండగట్టు సమీపంలో రాత్రి బస చేస్తారు. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో చొప్పందండి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుది. డిసెంబర్ 16 నుంచి 17 వరకు కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తారు. చివరి రోజు కరీంనగర్ లోని ఎస్. ఆర్ .ఆర్ కళాశాల వద్ద పాదయాత్రను ముగిస్తారు. ఆరోజు సాయంత్రం ఎస్ .ఆర్. ఆర్ కాలేజీలో జరిగే 5వ విడత పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.


నడ్డా వస్తుండడంతో ఒక్కరోజు ముందే ముగింపు...


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిజానికి 17వ తేదీన కరీంనగర్ లోని ఎస్. ఆర్. ఆర్ కళాశాలలో జరిగే చంద్ర ప్రజా సంఘామ యాత్ర ముగింపు సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ నెల 16వ తేదీన షెడ్యూల్ ఖరారు కావడంతో ఒకరోజు ముందే ముగించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జీ... బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.


ఉమ్మడి జిల్లాలోనూ మాటల తూటాలు తప్పవా...


ఇప్పటి వరకు జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సభలలో బండి సంజయ్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. నేరుగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. మరోవైపు లవ్ జిహాద్ మత మార్పిడి అంశాల పైన బోల్డ్ గానే మాట్లాడారు. ఇక జగిత్యాలలో సీఎం సభ ముగిసి టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో కచ్చితంగా మాటల తూటాలు పేలే అవకాశం ఉంది.