కరీంనగర్: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్దికి టీటీడీ చేస్తున్న కృషిని బండి సంజయ్ మెచ్చుకున్నారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇదే క్రమంలో కరీంనగర్ లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని తన లేఖలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయును బండి సంజయ్ కోరారు. 

2023లోనే కరీంనగర్ లోని టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది. అదే ఏడాది మే 31న కరీంనగర్ లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగింది. అప్పటినుంచి నేటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనుక టీటీడీ నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని’ టీటీడీ ఛైర్మన్ క రాసిన లేఖలో బండి సంజయ్ కోరారు.