ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ రోజు (నవంబరు 24) వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు.


‘‘సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడు. సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారు. బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడు. తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నడు. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా.  లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోచుకుని అడ్డంగా దోచుకుంటున్నరు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.


ఐటీ, సీబీఐ, ఈడీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు. ప్రజలను రాచిరంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా? రాజకీయ విమర్శలు చేసే వాళ్లు సమాధానం చెప్పాలి. అక్రమార్కులను పార్టీలకు అపాదించడం కరెక్ట్ కాదు. అక్రమార్కుల మీద దాడులు చేస్తే అడ్డుకోవడమేంది? 


అధికారులు తనిఖీలు చేస్తే నిజాయతీని నిరూపించుకునే అవకాశం ఉంది. అది చేతగానివాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ రాజకీయ రంగు పులుమతారు. అవినీతి తిమింగలాలను వదిలిపెట్టాలా? అవినీతి పరులు తప్పించుకోవడానికి ఏదో ఒక విమర్శలు చేయడం సిగ్గు చేటు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. బీజేపీ ఎంపీపైనా కూడా దాడులు చేశారు కదా... వాటికి పార్టీలతో పనిలేదు’’ అని బండి సంజయ్ మాట్లాడారు. 


బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర షురూ


బండి సంజయ్ ఈనెల 28 నుండి బండి సంజయ్  5వ విడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.  నిర్మల్ నియోజకవర్గంలోని  అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తారు. కరీంనగర్ లో ముగింపు సభ నిర్వహిస్తారు.  డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర సాగుతుంది. సీఎం కేసీఆర్ కుటుంబ- అవినీతి -నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు బీజేపీ ప్రకటించింది. ఐదో విడత పాదయాత్రను అక్టోబర్‌లోనే చేయాలనుకున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారు. 


మునుగోడు ఉపఎన్నిక కారణంగా గతంలో వాయిదా


పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని పాదయాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ తెలిపారు.   బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్రను కొనసాగించి 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తం బండి సంజయ్ పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గత ఏడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలోనూ బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు.