Bandi Sanjay asks Powerloom Cluster in Sircilla | న్యూఢిల్లీ: సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను బుధవారం నాడు బండి సంజయ్ కలిశారు. పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిరాజ్ సింగ్ ను బండి సంజయ్ కోరుతూ వినతిపత్రం అందజేశారు. నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో(యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఫ్యాషన్ పెరిగిపోయి, సంప్రదాయ ఉత్పత్తులకు పోటీ పెరిగిపోయిందని, దాంతోపాటు ముడిసరుకు ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధర అధికం అవుతుందన్నారు. కనుక ముడిసరుకు ఖర్చులు పెరగడంతో చేనేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారని.. వారికి సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని బండి సంజయ్ కోరారు. 


ఆధునిక యంత్రాలు ఇస్తే బెటర్


సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ను ఏర్పాటు చేస్తే, స్థానికంగా వేలాది మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సంప్రదాయ మెషీన్లు కాకుండా, ఆధునిక యంత్రాలు వారికి అందిస్తే.. ఉత్పాదకత పెరుగుతుందని గిరిరాజ్ సింగ్ కు తెలిపారు. కార్మికులు సాధ్యమైనంత త్వరగా నేత ఉత్పత్తులను అందిస్తూ, అప్పుల బాధ లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటారని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. 


పావలా వడ్డీకే రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థనపై గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని.. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నట్లు తెలిపారు. 80 శాతం సబ్సిడీ, పావులా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చించి కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.


Also Read: Pawan Donation: తెలంగాణలో వరద బాధితులకు పవన్ సహాయం- కోటి రూపాయల విరాళం ప్రకటన