Pawan Kalyan Visits Kondagattu Temple: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రం కొండగట్టును సందర్శించారు. సుమారు రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులతో ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. క్షేత్ర అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

Continues below advertisement

కొండగట్టు ఆలయంలో పవన్‌కు ఘన స్వాగతం 

కొండ గట్టు ఆంజనేయ స్వామిని తన ఇలవేల్పుగా పవన్ కల్యాణ్ భావిస్తారు. ఇక్కడ తనకు పునర్జన్మ లభించిందని చాలా సార్లు చెప్పారు. గతంలో అక్కడి పాలక మండలికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సందర్శించి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు. నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ వద్ద దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Continues below advertisement

భక్తుల వసుతులకు ప్రత్యేక ఏర్పాట్లు

గతంలో పవన్ కల్యాణ్ కొండగట్టుకు వచ్చినప్పుడు అక్కడ నెలకొన్న సమస్యల గురించి పాలక మండలి సభ్యులు చెప్పారు. ఏటా లక్షల్లో భక్తులు ఇక్కడి నేరుగా వేంకటేశ్వర స్వామని దర్శించుకుంటారని అన్నారు. ఈ రెండు దేవాలయాల మధ్య చాలా గట్టి అనుబంధం ఉందని వివరించారు. కానీ ఇక్కడి వచ్చే తిరుమలేశుడి భక్తులకు కనీస సౌకర్యాలు లేవని వివరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఉండేందుకు వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 

35 కోట్లు ఇచ్చిన టీటీడీ

గతంలో తన దృష్టికి వచ్చిన సమస్య గురించి ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడితో చర్చించారు. ఫలితంగా కొండ గట్టు ఆలయ అభివృద్ధికి 35.19 కోట్ల నిధులు ఇచ్చేందుకు టీటీడీ అంగీకరించింది. ఆ నిధులతో చేపట్టేబోయే పనులకు ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భూమిపూజ చేశారు. 

అభివృద్ధి పనులకు పవన్ శ్రీకారం 

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఉండేందుకు 96 గదులతో కూడిన ధర్మశాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు రెండు వేల మంది దీక్షలు విరమించేందుకు వీలుగా సువిశాలమైన మండపాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి కూడా పవన్ భూమి పూజ చేశారు. 

పవన్ కల్యాణ్‌  పిలుపు

ఈ పర్యటనలో మాట్లాడిన పవన్ కల్యాణ్‌ ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కేవలం భక్తికి సంబంధించింది కాదని అది సామాజిక సమగ్రతకు చిహ్నమని అన్నారు. కొండగట్టు లాంటి ఆలయాల అభివృద్ధికి సనాతన వాదులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తనకు చాలా భక్తి అని చెప్పుకొచ్చారు. తనకు ఇక్కడే పునర్జన్మ లభించిందని మరోసారి పునరుద్ఘాటించారు.

పవన్ ఇంకా ఏమన్నారంటే..."ఆంజనేయస్వామి అందరి దేవుడు, విశ్వాంతర్యామి. ఆయన ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి వారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం చేద్దాం. అందరూ పూనుకొని స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం” అని పిలుపునిచ్చారు. 

రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని, త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందన్నారు. 

“కొండగట్టు స్థానం ఎంత శక్తిమంతమైందంటే తెలంగాణకు పూర్తిస్థాయి రక్షణ, బలంగా మారుతుంది. కొండగట్టు గిరి ప్రదక్షిణకు ప్రయత్నం మొదలుపెట్టండి. నేను స్వయంగా వచ్చి కరసేవ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అంతా సమష్టిగా స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2008 నుంచి నాకు తెలుసు. ఉస్మానియాలో ఎన్ఎస్‌యూ నాయకుడిగా ఉన్నపుడు, నాతోపాటు కలిసి పనిచేసే వారు. తెలంగాణ ప్రజలు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నస్వామి వారి దివ్య అనుగ్రహానికి  ప్రత్యక్ష సాక్షి సత్యం. నేను గతంలో కొండగట్టు సందర్శించినపుడు అర్చకులు అప్పట్లో సత్రం కావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉన్నాం. ఈ అభివృద్ధి పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నాను. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి టీటీడీ బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు.