Telangana Municipal Elections 2026: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అంకానికి తెర లేవనుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభివృద్ధి పాలనను సమాంతరంగా పరుగులు తీయించడమే లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల ముహూర్తం ఖరారు
ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జనవరి రెండో వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. దీనికి రెండు తేదీలను కూడా ఖరారు చేశారు. సంక్రాంతి ముందు లేదా సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఎన్నికలను అక్కడికి నెల రోజుల్లో నిర్వహిస్తారు. అంటే ఫిబ్రవరిలో రెండు మూడు వారాల్లో చేపట్టేలా ప్రభుత్వం రోడ్ మ్యాప్ నిర్ణయించింది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన చేపడుతోంది. ఓటర్ల జాబితా సిద్ధంగా ఉండటంతో ఎన్నికల నిర్వహణకు సాంకేతిక అడ్డంకులు ఉండవని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
రాజకీయం కంటే నిధులు ముఖ్యం
ఎన్నికల నిర్వహణ కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాకుండా 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధుల పాలన ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నందున కేంద్రం గ్రాంట్లు విడుదల నిలిచిపోయింది. ఈ నిధులు వస్తే మున్సిపాలిటీల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు సర్పంచ్ ఎన్నికల్లో భారీగా స్థానాలు తమ పార్టీకి చెందిన వారిని గెలిపించుకున్న కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. ఇది కంటిన్యూ చేయడానికి కూడా ఈ ఎన్నికలు సహాయపడతాయని భావిస్తోంది.
జీహెచ్‌ఎంసీ గడువు ఫిబ్రవరితో పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు కూడా ఫిబ్రవరితో పూర్తి కానుంది. ఈ ఎన్నికల నిర్వహించే ముందు జీహెచ్‌ఎంసీని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలని ఆలోచిస్తోంది. ఈ విభజన ద్వారా నగర పాలనను మరింత వికేంద్రీకరించి, ప్రజలకు చేరువ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న 300 వార్డులను కూడా మూడు కార్పొరేషన్లకు తగ్గట్టుగా విభజిస్తారు. అనంతరం కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.
విదేశాల నుంచి వచ్చిన తర్వాత మరింత దూకుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరవుతారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇకపై కంటిన్యూగా ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 3న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి ఏదో గ్రామంలో కార్యక్రమం పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పర్యటించని ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే టైంలో ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా శ్రేణులను ఉత్సాహ పరచనున్నారు. ఓవైపు కేడర్‌లో జోష్ నింపుతూ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ చేస్తున్నామనే సంకేతాలు ఇస్తారు.