దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది. రాజరాజేశ్వర స్వామికి కానుకలు సమర్పించడం సహజమే అయినప్పటికీ ఓ కుటుంబం ఏకంగా రెండు లక్షల రూపాయల మూట వేసింది. కుమార్తె వీసా కోసం మొక్కుకున్న మొక్కుగా తెలుస్తోంది.
కూతురు వీసా పొందడానికి రాజన్న సహకారం కోరుతూ రెండున్నర లక్షల డబ్బుని ప్యాక్ చేసి అందులో లెటర్ రాసి మరీ హుండీలో వేసి వెళ్లారో అజ్ఞాత భక్తుడు. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా వైరల్ అవుతోంది. తమకు ఏదైనా మంచి జరిగితే దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. కానీ తమ కూతురికి వీసా రావాలంటూ ముందే దాదాపు రెండున్నర లక్షలు సమర్పించిన ఆ కుటుంబ సభ్యులు ఎవరనే చర్చ నడుస్తోంది.
వీసా రావాలనే ఇంత వేశారంటే రేపు వీసా వస్తే ఇంకా ఎలాంటి కానుక ఇస్తారో అని చర్చించుకుంటున్నారు. డింపుల్ కి వీసా రావాలంటూ రాసిన లెటర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే అది ఏ దేశానికి చెందిన వీసా, ఆ భక్తులు ఎవరో వంటి వివరాలు మాత్రం తెలియడం లేదు.
రాజన్న హుండీ ఆదాయం రికార్డులు బద్దలు...
12 రోజుల్లో రాజన్న హుండీలో భక్తులు 2 కోట్ల 25 లక్షల 04 వేల 855 రూపాయల నగదు, 247 గ్రాముల 860 మిల్లీ గ్రాముల బంగారం, 12 కిలోల 940 గ్రాముల వెండి వేశారు. గత నెల 27 వ తేదీ నుంచి ఇప్పటి వరకు లెక్కించిన ఆదాయం గతంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో కంటే ఎక్కువగా ఉంది. గతంలో కోటిన్నర రూపాయల ఆదాయం సమకూరగా, ఈసారి లెక్కింపులో ఏకంగా రూ.2 కోట్ల 25 లక్షలకుపైగా నగదుతో బాటు బంగారం, వెండి కానుకలుగా లభించడం విశేషం.
రాజన్నను దర్శించుకున్న తరువాతే పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు మేడారం వైపు వెళ్తారు. దీంతో వారు తమ కానుకలను బోనాలతోపాటు సమర్పించుకొని మేడారం వైపుగా సాగుతున్నారు. సాధారణ రోజుల్లో కంటే అత్యధికంగా దాదాపు 50 వేల మంది భక్తులు ప్రతిరోజు రాజన్నను దర్శించుకుంటున్నారు. క్యూ లైన్‌లో దాదాపు ఆరు గంటలపాటు వేచి చూస్తున్నారు అంటే ఇప్పుడున్న రద్దీ అర్థం చేసుకోవచ్చు. సమ్మక్క సారక్క జాతర ముగిసే వరకూ ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.