Karimnagar News: పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కరీంనగర్ నుంచి బండికి బీజేపీ టికెట్ ఫిక్స్ చేసింది. ఇక బీఆర్ఎస్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు టికెట్ ఖరారు చేసింది. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇరువురు మధ్య పోటీ జరగనుంది. ఇక కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రుద్ర సంతోష్, ప్రవీణ్ రెడ్డి, రాజేంద్రరావు పేర్లను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. కరీంనగర్ పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉంది. దీంతో ఆర్ధికంగా బలంగా ఉన్న రాజేంద్రరావును బరిలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
కాంగ్రెస్ పోటీ ఇస్తుందా..?
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్న సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో కరీంనగర్ సీటు కూడా ఒకటి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు త్రిముఖ పోరుతో లక్షా 79 వేల ఓట్లు వచ్చాయి. ఈ సారి గట్టి అభ్యర్థిని పోటీలోకి దింపితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశముంటుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కరీంనగర్‌లో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చివరికి రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేంత వరకు మాటలు వెళ్లాయి.
రాజకీయ సన్యాసం తీసుకుంటా
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ చేశారు. గురువారం కరీంనగర్‌లో ఓ సమావేశంలో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బండి స్పందించారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా? అంటూ కేటీఆర్‌క ఛాలెంజ్ చేశారు. కరీంనగర్‌లో ఎవరేం చేశారనే దానిపై చర్చకు తాను సిద్దంగా ఉన్నట్లు బండి ప్రకటించారు. అభివృద్ది, రామమందిర నిర్మాణంకు సంబంధించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని అన్నారు.
కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే కరీంనగర్‌లో అడుగు పెట్టలేరని బండి సంజయ్ హెచ్చరించారు. ఇటీవల హుస్నాబాద్‌లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌పై కేటీఆర్ విమర్శలు కురిపించారు. బండి సంజయ్ ఎంపీగా ఐదేళ్లల్లో ఏం చేశారని ప్రశ్నించారు. అభివృద్ది ఏం చేశారనేది చెప్పే దమ్ము ఆయనకు ఉందా? అని అన్నారు. కరీంనగర్ ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని, కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ చేసిందేమి లేదని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీగా గత ఎన్నికల్లో వినోద్ కుమార్‌ను గెలిపించి ఉంటే నియోజకవర్గానికి ట్రిపుల్ ఐటీ వచ్చేదని, బండి సంజయ్ ఓ గుడి, బడి, యూనివర్సిటీ కూడా కట్టలేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వినోద్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. దీంతో కేటీఆర్ తనపై చేసిన విమర్శలకు గురువారం బండి కౌంటర్ ఇచ్చారు.