Karimnagar News : నిర్మాణాల్లో వాడే ఇసుక క్వాలిటీకి కరీంనగర్ పెట్టింది పేరు. గోదావరి నదీ తీరం వెంబడి ఇసుక భారీగా లభ్యమవుతోంది. ఇసుకే కదా అని లైట్ గా తీసుకోకండి. దాన్ని నమ్ముకొనే అతి తక్కువ కాలంలో ఎక్కడికో ఎదిగిపోయిన నాయకులు, చోటా మోటా లీడర్లు జిల్లా అంతటా ఉన్నారనేది ఇక్కడ బహిరంగ రహస్యం. ఇక ఇక్కడి ఇసుకని హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు భారీ ఎత్తున కొనుగోలు చేసి తమ ప్రాజెక్టుల కోసం డంప్ చేస్తూ ఉంటారు. ఇదే ఇప్పుడు అక్రమార్కులకు జిల్లాలో ఇదే వరంగా మారింది. వర్షాలకు చెరువులు వాగులు నిండుతూ ఉండటంతో ఇసుక తవ్వకాలు వేగవంతం చేశారు దందా రాయుళ్లు. ఇంకో నాలుగు రోజులైతే అసలుకే దొరకని పరిస్థితి ఏర్పడుతుండటంతో ముందుగానే జాగ్రతాపడుతున్నారు. ఎక్కడికక్కడ రహస్య ప్రదేశాల్లో దాచేస్తున్నారు.
సాండ్ ట్యాక్స్
ఇసుక రీచ్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్.ఆర్.వోలు ఇసుకపై ప్రత్యేకమైన టాక్స్ వేయడంతో లబ్ధిదారులకు మాత్రమే రిచ్ ల నుంచి ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుంది. రోజుకు ఒకటి లేదా రెండు ట్రిప్పులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక్కో ట్రాక్టర్ కు నంబర్ కేటాయిస్తారు. అనుమతి లభించిన ట్రాక్టర్లను ఎస్.ఆర్.వోలు రీచ్ ల వద్దకి తీసుకెళ్లి ఇసుక సరఫరాకు అనుమతిస్తారు. కానీ యజమానులతో కుమ్మక్కై ఎలాంటి మెసేజ్ రాకముందే ట్రాక్టర్లలో ఎక్స్ట్రాలోడ్ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఒకసారి అనుమతి తీసుకొని రోజంతా ట్రిప్పులు కొడుతున్నారు. ఈ ట్యాక్స్ కట్టేవారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పర్మిషన్ కూడా ఆన్లైన్ ద్వారా ఇస్తారు.
రాత్రిపూట యథేచ్ఛగా తోలకాలు
అయితే అనుమతి ఇచ్చే అధికారులతో కుమ్మక్కైన ట్రాక్టర్ యజమానులు, అక్రమ ఇసుక నిర్వాహకులు రాత్రిపూట కూడా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. మొదట రీచ్ ల నుంచి భారీ ఎత్తున తరలించి వారికి చెందిన రహస్య ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో వర్షాలు మరింత పడనుండటంతో నదీ తీరంలో ఇసుక గోతులు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో సిరిసిల్లలో ఇలాంటి గుంతలోనే స్కూల్ పిల్లలు మునిగి చనిపోయారు. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు తీర ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుంతలు తోడుతూ ఉండటంతో అది తెలియని ప్రజలు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇసుక తరలించే ట్రాక్టర్లను అతివేగంగా తోలుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపడితే రానున్న రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు కోరుతున్నారు.