Minister KTR Tour : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. కరీంనగర్ రాజకీయాల గురించి గతంలోని పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఒకానొక సమయంలో ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న అప్పటి టీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి మరోసారి కేటీఆర్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సీఎం కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కేంద్ర రాజకీయాల వైపు వడివడిగా అడుగులేస్తుంటే రాష్ట్రంలో కేటీఆర్ తనదైన వ్యూహాలతో ప్రతి ప్రాంతంలోనూ స్థానిక నాయకత్వాన్ని గైడ్ చేస్తూ సమన్వయంతో పనిచేస్తున్నారు. 


షెడ్యూల్ ఇలా 


మంగళవారం ఉదయం 8:15 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మంత్రి కేటీఆర్. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 8:30 ప్రాంతంలో బయలుదేరి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత ఉదయం 9:30 గంటలకు పట్టణ కేంద్రంలోని సర్క్యూట్ హౌస్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ప్రారంభించి తిరిగి కరీంనగర్ పట్టణం నుంచి హెలికాప్టర్ ద్వారా పదిన్నర గంటలకు బయలుదేరి 11 గంటలకు హనుమకొండకు చెందిన కమలాపూర్ కి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట పాటు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని బస్టాండ్ కమ్యూనిటీ హాల్స్,  ఆలయాలతో పాటు మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర స్కూల్, బాలికల స్కూల్ జూనియర్ కాలేజీ, కస్తూర్బా జూనియర్ కాలేజీలను ప్రారంభిస్తారు. ఇక ఒంటిగంట ప్రాంతంలో స్థానిక ఎంజెపి స్కూల్ కి చెందిన పిల్లలతో లంచ్ చేస్తారు. కమలాపూర్ పట్టణం నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకి చేరుకుంటారు కేటీఆర్. అక్కడ రెండున్నర ప్రాంతం నుంచి ఐదు గంటల వరకు జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఐదు గంటలకు జమ్మికుంట పట్టణం నుంచి కరీంనగర్ కి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి హుజురాబాద్ లోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరి 6 గంటల ప్రాంతంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు.


ప్రతిపక్ష నేతల అరెస్టులు 


కేటీఆర్ పర్యటనకు పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ప్రతిపక్షాల నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా భద్రతను సమీక్షిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న స్థానిక కాంగ్రెస్, బీజేపీ ఇతర నేతలను అరెస్టులు చేస్తోంది. కేటీఆర్  కమలాపూర్ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 24 గంటల ముందే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనులో పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లాని మొత్తం పోలీసు రాజ్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి కేటీఆర్ కు లేదన్నారు. పర్యటన అనగానే  అవతల పార్టీ వాళ్లను అరెస్టు చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కట్టించిన బిల్డింగులకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. 


పొన్నం ప్రభాకర్ ఫైర్ 


మంగళవారం కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులని అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖండించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రెండు రోజుల ముందుగానే కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారని, ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఇటువంటి నిరసనలు ఎదుర్కోవద్దు  అనుకుంటే హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఇచ్చిన వేల కోట్ల హామీలను  అమలుచేలాని కోరారు.  గ్రామాలకు  రోడ్లు ఇతర  ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు.  రాజకీయ పర్యటనలు చేపట్టి నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి  జైల్లో పెట్టి పర్యటనను విజయవంతంగా చేసుకుందామనుకుంటే పొరపాటే అని పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.