Minister Gangula Kamalakar :తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ పూర్తైందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సీజన్లో 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటికే రైతులకు రూ.9680 కోట్లు చెల్లించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ. కోటీ ఎనిమిది వేల కోట్లు రైతులకు అందజేశామన్నారు. ఆరు కోట్ల ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలో రికార్డు నెలకొల్పిందన్నారు. 


50.67 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ 


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో యాసంగి ధాన్యం సేకరణ ముగింసిందని, రైతులకు సకాలంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ ఏడాది రబీలో రూ.9916 కోట్ల విలువగల 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దాదాపు 9 లక్షల 52వేల మంది రైతుల నుండి సేకరించామన్నారు. ధాన్యానికి నగదు మొత్తం సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకొని ఓపిఎంఎస్లో నమోదైన రూ.9724 కోట్లకు గానూ రూ.9680 కోట్లను సకాలంలో రైతులకు చెల్లించామన్నారు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఓపీఎంఎస్లో నమోదైన ప్రకారం చెల్లింపులు కొనసాగుతాయన్నారు. అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6,42,894 మెట్రిక్ టన్నుల్ని, అత్యల్పంగా ఆదిలాబాద్ లో 322 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. 


రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 


2014-15 సీజన్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఒక కోటీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం రైతులకు అందజేసిందని తెలిపారు. ఎంఎస్పీ ప్రకారం పంట సేకరణ చేయడమే కాకుండా కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలుగకుండా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ 6 కోట్ల 6 లక్షల 53వేల 234 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు సంపూర్ణంగా అండగా నిలవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం పోటీరాలేదన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ధాన్యం సేకరణ వంటి రైతు అనుకూల విధానాల్ని అవలంబిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు . 


Also Read : Nizamabad News: మరోసారి లైమ్‌లైట్‌లోకి బాబ్లీ ప్రాజెక్టు- ఈసారి మాత్రం వేరేలా


Also Read : KTR Letter To PM Modi : బీజేపీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ