KTR Letter To PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని కోరారు. బీజేపీ డీఎన్ఏలో విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న నేతలు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అన్నారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేదన్నారు. బీజేపీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం అని విమర్శలు చేశారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న బీజేపీకి ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 


డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో దుర్భర పరిస్థితులు 


హైదరాబాద్ కు వస్తున్న బీజేపీ నాయకులకు మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని తెలంగాణ ప్రజల తరఫును స్వాగతం అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అద్భుతమైన అభివృద్ధితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. హైదరాబాద్ లో బీజేపీ సమావేశం పెట్టుకోవడం ఆశ్చర్యం ఏమీ అనిపించడం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులు కొలువైన రాష్ట్రాల్లో ఇప్పటికీ దుర్భర పరిస్థితులే ఉండడం వల్ల తెలంగాణకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని భావిస్తున్నానన్నారు. కారణాలు ఏవైనా పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్ లో మకాం పెడుతున్న సందర్భంలో కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, గంగా జమునా తెహజీబ్ ను గుండెల నిండా నింపుకోండని సలహా ఇచ్చారు. 


ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందా?  


ఇరిగేషన్- ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఇన్నోవేషన్- ఇంక్లూజివ్ నెస్ వంటి విధానాలతో, సమ్మిళిత అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ గడ్డ బీజేపీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్పూర్తితో అభివృద్ధి ఏజెండాను చర్చించేందుకు తెలంగాణను మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదన్నారు. అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న బీజేపీ ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రవేశపెట్టిన పలు పథకాలకు తెలంగాణ కార్యక్రమాలే స్ఫూర్తి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను అన్నారు. అందుకే ఆవో..దేఖో... సీకో (రండి-చూడండి-నేర్చుకోండి)అంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 


గుజరాత్ లో కరెంట్ హాలీడేలు 


2018 లోనే ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామంటూ కేంద్రం చెప్పిన అబద్దాలను దేశం ముందు నిలబెట్టేలా, మీ పార్టీ తరపున దేశ ప్రథమ పౌరులిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము సొంత గ్రామంలో కరెంటు రాని పరిస్థితి. స్వయంగా మీ సొంత రాష్ర్టం గుజరాత్ లో కరెంటు సరఫరా చేయలేక చేతులెత్తేసి పవర్ హాలీడేలు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంటే. కనురెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల విద్యుత్ తో నిత్యం ప్రకాశిస్తున్న తెలంగాణ మా దగ్గరుంది. - మంత్రి కేటీఆర్ 


మాటలతో మభ్యపెట్టడం మీ విధానం 


మాటలతో మభ్యపెట్టడం, మసి పూసి మారెడు కాయ చేయడం బీజేపీ విధానమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జిల్లాకొక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటుంది. ప్రతీ పల్లెలోనూ ప్రాథమిక వైద్యాన్ని పటిష్టంగా మారుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో బస్తీకొక దవాఖానా ఏర్పాటుచేసి ఖరీదైన వైద్యాన్ని పేదోడి గుమ్మం ముందుకు తెచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమం కంటి వెలుగును చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలీకరణ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.