Minister Gangula Kamalakar : ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ మీరు ఒకటంటే మేం పదంటాం అన్నట్లు విమర్శలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అమర్ నాథ్, తాజాగా అంబటి రాంబాబు.... హరీశ్ రావుపై విరుచుకుపడ్డారు. హరీశ్ రావు, కేసీఆర్ మాకు చెప్పే స్థితిలో లేరంటూ వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. నిన్నటి వరకూ ఏపీ మంత్రులు వ్యాఖ్యలపై తెలంగాణ నుంచి ఎవరూ కౌంటర్ ఎటాక్ చేయలేదు. అయితే తాజాగా ఏపీ మంత్రుల మూకుమ్మడి దాడిని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.  


సజ్జల కుటుంబాల్ని విడదీయడంలో సిద్ధహస్తుడు 


ఏపీలో ఉపాధ్యాయుల‌ను నిరసనలు చేస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తు్న్నారని వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.  ఈ వ్యాఖ్యల‌పై ఏపీ మంత్రులు, వైసీపీ కీల‌క నేత‌లు మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హ‌రీశ్ రావుకు విభేదాలుంటే వాళ్లు వాళ్లూ చూసుకోవాలని వైసీపీ ప్రధాన కార్యద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యల‌పై తెలంగాణ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ శ‌నివారం కౌంటర్ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప‌చ్చని కుటుంబాల‌ను విడదీయ‌డంలో సిద్ధహ‌స్తుడ‌ని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబాన్ని స‌జ్జల విచ్ఛిన్నం చేశార‌ని ఆరోపించారు. త‌ల్లీకొడుకులను విడదీసిన స‌జ్జల‌ అన్నను, చెల్లిని కూడా విడ‌దీశార‌న్నారు. వైఎస్సార్ ఫ్యామిలీని విడగొట్టిన స‌జ్జల‌ ఇప్పుడు పచ్చని సంసారంలా సాగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని విడ‌దీయ‌డానికి ప్రయ‌త్నిస్తున్నార‌ని విమర్శించారు.  వైఎస్సార్ ఫ్యామిలీని విడ‌దీసిన‌ట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని స‌జ్జల రామకృష్ణారెడ్డి విడ‌దీయ‌లేర‌ని గంగుల కమలాకర్ అన్నారు.


పాలన బాగుంటే విమర్శలు ఎందుకు? 


2014కు ముందు అస‌లు స‌జ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవ‌రికి తెలుసని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత వైసీపీలో చేరిన స‌జ్జల‌ ఆ పార్టీని ఉడుములా ప‌ట్టేశార‌ని ఆక్షేపించారు. అస‌లు తెలంగాణ వ్యవ‌హారాల‌తో వైసీపీ నేతలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ ప‌థ‌కాలు భేష్ అని చెబుతున్నారని, ఆ క్రమంలోనే ఇత‌ర రాష్ట్రాల పేర్లను ప్రస్తావిస్తున్నామ‌న్నారు. వైసీపీ పాల‌న బాగుంటే హ‌రీశ్ రావు వ్యాఖ్యల‌తో స‌జ్జల ఎందుకు విమర్శలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ స‌త్తా ఏంటో మ‌రోమారు చూపించాలంటే అందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. తెలంగాణతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 2014కు ముందు ఉద్యమంలోనే చూశారని గుర్తు చేశారు. ఇక‌నైనా త‌మ‌తో పెట్టుకోవ‌ద్దని వైసీపీ నేత‌ల‌కు మంత్రి గంగుల కమలాకర్ హితవు పలికారు.  


అమరావతి నుంచి హైదరాబాద్ కు వలసలు


టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. కేసీఆర్ ఆ కుటుంబానికి తండ్రి లాంటివారు. మా కుటుంబంలోంచి ఒక్కర్ని వేరుచేసే కుట్రలు ఫలించవు. బీజేపీకి బీటీంలా ప‌నిచేస్తూ, ఎదురించే ధైర్యం లేకుండా రైతుల పొట్టకొట్టేలా మీట‌ర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం ఎక్కడా... ధైర్యంగా బీజేపీని ఎదిరించిన కేసీఆర్ ఎక్కడా. పాల‌నా వైఫల్యాల్ని క‌ప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై కుట్రల‌కు దిగార‌ు. మా సింగ‌రేణిలో, క‌రెంటులో మీ చొర‌బాటేంది. దేశానికి మార్గద‌ర్శకంగా ఎదుగుతున్న తెలంగాణ‌ను చూసి ఓర్వలేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల‌కు వైసీపీ జ‌త‌క‌లిసింది. గుజ‌రాత్, ఉత్తర‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల క‌న్నా తెలంగాణ ప‌థ‌కాలు ఎలా ఆద‌ర్శమో అలాగే ఏపీ విష‌యంలోనూ హ‌రీష్ రావు మాట్లాడార‌ని దీన్ని ఎదుర్కొనే ద‌మ్ము లేక‌నే వ్యక్తిగ‌త హ‌న‌నం చేస్తున్నార‌ు. ఏనాడైనా హ‌రీష్ రావు కేసీఆర్ అల్లున్ని అన్నారా?.   అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ కు వ‌ల‌సలు వ‌స్తున్నార‌ు. ఏపీ నుంచి తెలంగాణ‌కు వ‌చ్చిన వాళ్లను అడ‌గండి తిరిగిర‌మ్మని క‌నీసం వ‌స్తారా? స‌జ్జల  ఏపీ ప్రభుత్వానికి 3,4 రాజ‌ధానుల కోసం స‌ల‌హాలిచ్చుకోండి. తెలంగాణ వ్యవ‌హారాల్లో త‌ల‌దూర్చొద‌ు. తెలంగాణ అంటేనే బ‌హుజ‌నుల గ‌డ్డ, బ‌హుజ‌నుల బందు కేసీఆర్, మా వ్యవ‌హారాల్లో త‌ల‌దూరిస్తే వ‌దిలేది లేద‌ు.   " - మంత్రి గంగుల కమలాకర్.