Sainik Schools : దేశ వ్యాప్తంగా కొత్తగా 21 సైనిక్ స్కూళ్ల(Sainik Schools)ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ(Defence Ministery) నిర్ణయించింది. తొలి విడతలో కరీంనగర్(Karimnagar) కి అవకాశం దక్కింది. దీనికి కేంద్ర రక్షణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు ఇస్తూ లేఖ విడుదల చేసింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ లో నడుస్తున్న గురుకుల సైనిక్ పాఠశాల ను ఇందులో భాగంగా ఎంపిక చేశారు. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ దేశవ్యాప్తంగా వంద సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా అందులో 2022-23 సంవత్సరానికి 21 పాఠశాలకు తొలివిడతలో అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయంపై కరీంనగర్ లోని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


 సైనిక్ స్కూల్ తో ప్రయోజనం 


ప్రధానంగా రక్షణ శాఖ నుంచి అనుమతులు రావడంతో భారీ ఎత్తున నిధులు వచ్చి సైనిక్ పాఠశాలలో వసతులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తున్న సైనిక పాఠశాల కోసం కేంద్ర బలగాలు బోధన, ఇతర కీలక రంగాల్లో శిక్షణ సైతం ఉన్నాయి. దీనికోసం ప్రవేశాలు ఆరో తరగతి నుంచి ప్రారంభం అవుతాయి. కనీసం 40 శాతం సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) నిర్వహించే ఆల్ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(Sainik Schools Entrance Exam) లో అర్హత సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 60 శాతం సీట్లను అదే స్కూల్లో చదివి సైనిక్ స్కూల్ లో చేరాలనుకునే విద్యార్థులకు అర్హత పరీక్ష ద్వారా కేటాయిస్తారు. దీనికోసం నోటిఫికేషన్(Notification) ప్రత్యేకంగా ఉంటుంది. ఒక నెల ముందుగానే మేలో వీరి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. జాతీయ స్థాయిలో ఉండే పలువురు నిపుణులు ఇక్కడ విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాల వైపు పిల్లలూ దృష్టిసారించే అవకాశం ఉంటుంది.


 ఎంపీ బండి సంజయ్ ధన్యవాదాలు


 తొలి విడతలోనే కరీంనగర్ కి సైనిక్ స్కూల్ కేటాయించడానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇవ్వడంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ కూడా ఒక సైనిక్ స్కూల్ ఉండాలంటూ కేంద్ర రక్షణ మంత్రికి లేఖ రాశానని, కేంద్ర అధికారులకు సైతం పలుమార్లు కలిసి ఇక్కడి అవసరాన్ని వారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ(PM Modi), రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) లకు కృతజ్ఞతలు తెలిపారు.