Kamareddy News : విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులతో  అసభ్యకర మాటలు మాట్లాడుతూ బూతు పురాణం వల్లించారు. కామారెడ్డి జిల్లా మేనూర్ ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థినులను గదిలో పెట్టి కట్టెలు విరిగిపోయేలా చితకబాదింది. విచక్షణా రహితంగా విద్యార్థినులను కొట్టిన తెలుగు టీచర్ మహేశ్వరిని సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు విద్యార్థులు నిరసన చేపట్టారు.


అసలేం జరిగింది? 


 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థినులను తెలుగు టీచర్ మహేశ్వరి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో విద్యార్థులు తెలుగు టీచర్ ను  సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు నిరసన చేపట్టారు. తెలుగు టీచర్ మహేశ్వరి కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొంత మంది విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు. టీచర్ కు ఈ విషయం తెలియడంతో విద్యార్థులను పిలిపించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు. దీంతో పోస్ట్ చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు తప్పయిందంటూ మరొకసారి ఇలా చేయమంటూ క్షమాపణలు కోరారు. 


కట్టెలు విరిగేలా కొట్టిన టీచర్ 


అయినా కోపంతో తెలుగు టీచర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విద్యార్థినులను పచ్చి కట్టెలు విరిగేలా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వచ్చి సదరు ఉపాధ్యాయురాలతో వాగ్వివాదానికి దిగారు.  విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరు ఇలా విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడమెంటని ప్రశ్నించారు. బట్టలూడదీసి కొడతానంటూ టీచర్ అసభ్యకరంగా మాట్లాడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. టీచర్ తమను ఇష్టం వచ్చినట్టు కొట్టిందంటూ బాధిత విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ పాఠశాల ముందు కూర్చొని తెలుగు టీచర్ మహేశ్వరిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.


బస్సు కోసం విద్యార్థులు ధర్నా 


పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు రహదారిపై కూర్చొని ధర్నా చేశారు. కండ్లకుంట గ్రామంలోని మోడల్  స్కూల్ కి  అదనపు బస్సు కావాలంటూ రోడ్డుపై విద్యార్థులు ధర్నా చేశారు. విద్యార్థులకు సరిపడా బస్సులు లేవని ఆందోళన చేశారు. బస్సు కావాలి అంటూ ఫ్లకార్డులతో విద్యార్థులు ధర్నా చేశారు. 


రెండో ఎక్కం చెప్పలేదని విద్యార్థికి డ్రిల్లింగ్ మెషీన్‌తో పనిష్‌మెంట్


యూపీలోని కాన్‌పూర్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో దారుణం జరిగింది. ఐదో  తరగతి పిల్లాడు రెండో ఎక్కం మర్చిపోయాడన్న కోపంతో ఓ టీచర్ విద్యార్థి చేతిని డ్రిల్లింగ్ చేశాడు. రెండో ఎక్కం చెప్పాలని అడిగినా...చెప్పలేదని..ఇలా డ్రిల్లింగ్ మెషీన్‌తో చేతిని డ్రిల్ చేశాడు. సిసమౌకు చెందిన విద్యార్థిని...ప్రేమ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అప్పర్ ప్రైమరీ చదువుతోంది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. "రెండో ఎక్కం చెప్పాలని టీచర్ నన్ను అడిగారు. నేను చెప్పలేకపోయాను. వెంటనే ఆయన నా చేతిని డ్రిల్ చేశాడు. నా పక్కనే ఉన్న ఫ్రెండ్ డ్రిల్లింగ్ మెషీన్ ప్లగ్‌ను వెంటనే తీసేసింది" అని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. విద్యార్థిని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్కూల్‌కి వచ్చారు. దీంతో చాలా సేపటి వరకూ ఉద్రిక్తత నెలకొంది. వీళ్లంతా వచ్చి నిలదీసేంత వరకూ స్థానిక విద్యా అధికారులకు ఈ సంఘటన గురించి తెలియనే లేదు. ఈ ఘర్షణ జరిగాకే...స్థానిక విద్యాధికారులు స్పందించారు. ఈ సంఘటన గురించి
తెలుసుకున్న అధికారులు...విచారణకు ఆదేశించారు. "ఈ ఘటనను విచారించేందుకు ప్రత్యేక కమిటీ నియమించాం. ప్రేమ్‌నగర్, శాస్త్రి నగర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌లు విచారణ జరిపించి రిపోర్ట్ తయారు చేస్తారు.  ఇందుకు బాధ్యులైన వారిపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం" అని వెల్లడించారు. బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి.