Kamareddy News : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ రచ్చకెక్కింది. రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ రచ్చరచ్చగా మారింది. మరోసారి ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. ఇటీవల కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, మదన్ మోహన్ రావు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపణ చేస్తూ ఆపార్టీ నుంచి సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. మదన్ మోహన్ రావుపై పీసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ సుభాష్ రెడ్డి వర్గీయులు అక్కడ రావడంతో వారిపై  మదన్ మోహన్ వర్గం కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఇప్పటికీ మదన్ మోహన్ ను సస్పెన్షన్ ఎత్తివేయలేదని సుభాష్ రెడ్డి అన్నారు. ఒకవేళ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేస్తే చూపించాలని కార్యకర్తలు కలిసి కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. మదన్ మోహన్ పై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్న విషయం సుభాష్ రెడ్డి గుర్తుచేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయుల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఘర్షణలో గాయపడ్డ వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


రేవంత్ రెడ్డి ముందే వర్గపోరు 


కొద్ది రోజుల క్రితం ఎల్లారెడ్డిలో జరిగిన సభలో ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావుల మధ్య వర్గ పోరు బహిరంగమైంది. ఒకరి వర్గం మరో వర్గం ఫ్లెక్సీలు చింపేశారు. మదన్ మోహన్ రావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో మదన్ మోహన్ రావు ఓటమి చెందారు. అయితే అప్పటి నుంచి మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజక వర్గంపై కన్నేశారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాజుల సురేంధర్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంపై సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు కన్నేశారు. ఇద్దరు ఎవరికి వారే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఇరువర్గాలకు మింగుడు పడటం లేదు. మదన్ మోహన్ రావు పార్టీ నాయకులకు సమాచారం లేకుండా సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారన్న కారణంతో కామారెడ్డి జిల్లాలోని ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ సీనియర్ నాయకులు షబ్భిర్ అలీ సైతం మదన్ మోహన్ రావు తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇష్యుపై ఇప్పటికే పీసీసీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై పీసీసీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అయితే ఇవాళ ఎల్లారెడ్డి పల్లి తాండలో జరిగిన రచ్చ బండలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.