Kamareddy News : కన్న తల్లిదండ్రులను మోసం చేసిందో కూతురు. భర్తతో కలిసి తల్లిదండ్రుల వద్ద డబ్బు కాజేసి బయటకు గెంటేసింది. వృద్ధాప్యంలో ఆసరా ఉంటామని నమ్మించి రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారం తీసుకున్న కూతురు ఆ తర్వాత వారిని ఇంట్లోంచి బయటకు గెంటేసింది. దీంతో ఆ వృద్ధ దంపతులు కూతురు ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగారు.
అసలేం జరిగింది?
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బండ గల్లీలో కన్న తల్లిదండ్రులని చూడకండా కసాయిలా ప్రవర్తిస్తోంది కన్న కూతురు. కూతురే అన్ని భావించిన తల్లి దండ్రులను మోసం చేసింది ఆ కూతురు. తల్లిదండ్రుల బరువు బాధ్యత చూసుకుంటానని వారివద్ద ఉన్న 10 లక్షల నగదు, 15 తులాల బంగారo తీసుకుంది. తీరా ఆ వృద్ధ దంపతులను కూతురు అల్లుడు ఇంట్లోంచి గెంటేశారు. డబ్బుకు ఆశపడి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి చివరికి వృద్ధులని చూడకుండా వారిని గెంటేయటంపై ఆవేదన చెందుతున్నారు బాధితులు. కూతురు ఇంటి ముందే టెంట్ వేసుకుని న్యాయ పోరాటం చేస్తున్నారు తల్లిదండ్రులు. తమ వద్ద ఉన్న నగదు, బంగారం తీసుకుని చివరికి కన్న కూతురే అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఎలా బతికేది?
"మేము ఎలా బతకాలి. ఎక్కడికి వెళ్లగలం. ముగ్గురు ఉన్నాం. మా అక్క కూడా మాతోనే ఉంటుంది. ఆమెకు నడుం ఇరిగిపోయింది. నేను కూడా ఏ పనిచేయలేకపోతున్నాను. నా బిడ్డకు డబ్బులు ఇచ్చాను. డబ్బులు తిరిగి ఇవ్వమంటే అల్లుడు కొట్టడానికి వచ్చాడు. మాకు ఆధారం ఏంటి? 10 లక్షలు , 15 తులాల బంగారం ఇచ్చాం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు నాకు. ఒక కొడుకు చచ్చిపోయిండు. కొడుకును నమ్మకుండా బిడ్డను నమ్మి డబ్బు, బంగారం ఇచ్చాను. ఇప్పుడు బిడ్డ మోసం చేసింది. ఆరోగ్యం బాగోలేక దవఖానాకు వెళ్లాను. అప్పుడు డబ్బులు బిడ్డ దగ్గర పెట్టాను. దవఖానా నుంచి తిరిగి వచ్చాక డబ్బులు ఇవ్వమంటే ఎనిమిది దినాల్లో ఇస్తానంది. ఇప్పుడు మోసం చేసింది. డబ్బులు అడుగుతుంటే అల్లుడు కొట్టడానికి వస్తున్నాడు. " - బాధితుడు
కూతురి ఇంటి ముందు నిరసన
కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రానికి చెందిన వీరయ్య చారి, అంజవ్వలకు ఇద్దదరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి పెద్ద కుమారు వెంకటేశం అనారోగ్యంతో మరణించాడు. చిన్న కుమారుడు శ్రీనివాస్ నిజామాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వారి కుమార్తె అనిత బాన్సువాడ పట్టణం బండగల్లిలో ఉంటుంది. అయితే తల్లిదండ్రుల బాధ్యతను చూసుకుంటానని చెప్పిన అనిత వారిని బాన్సువాడలోని తన ఇంటికి తీసుకెళ్లింది. కొన్ని రోజులు అంతా సవ్యంగానే నడిచింది. ఆ తర్వాత అనిత అసలురూపం బయటపడింది. తల్లి వద్ద ఉన్న 15 తులాల బంగారం, రూ. 10 లక్షల నగదును తీసుకుని తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసింది. ఇందుకు అనిత భర్త కూడా సహకరించాడు. కన్న బిడ్డే అన్యాయం చేసిందని ఆ వృద్ధ తల్లిదండ్రులు అనిత ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగారు. కూతురు ఇంటి ముందు టెంట్ వేసుకుని దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణాలు వదులుకోవడం తప్ప ఇంకేం చేయలేమన్నారు.