జాతీయ పురస్కార గ్రహీత వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'విడుతలై' (Viduthalai Movie). ఇందులో తమిళ హాస్య నటుడు సూరి (Tamil Comedian Soori) కథానాయకుడు. తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన విలక్షణ కథానాయకుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వాతియర్‌గా కీలక పాత్ర చేస్తున్నారు. 


ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే... ఆ సీన్స్ తీస్తున్నప్పుడు సెట్‌లో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. దాంతో స్టంట్ మాస్టర్ ఒకరు మృతి చెందారు. 


ఇరవై అడుగుల ఎత్తు నుంచి పడటంతో... 
'విడుతలై' చిత్రీకరణలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రముఖ స్టంట్ మాస్టర్‌కు సహాయకుడిగా పని చేస్తున్న ఎన్. సురేష్ అనే స్టంట్ మాస్టర్ మృతి చెందారు. చెన్నైలోని వండలూర్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా పడిపోయిన ట్రైన్ మీద నుంచి ప్రయాణీకులు పరుగులు తీసే సన్నివేశాలు తీస్తున్నారు. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సురేష్ బాడీకి కట్టిన రోప్ తెగడంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కింద పడిన సురేష్‌ను హుటాహటిన సమీపంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ప్రాణం దక్కలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు గాయపడిన మరో స్టంట్ మాస్టర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 


Also Read : గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?


ఆర్.ఏస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జైయంట్ మూవీస్ పతాకంపై ఎల్‌డ్రెడ్‌ కుమార్, ఉదయనిధి స్టాలిన్ కలిసి 'విడుతలై' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెట్రిమారన్ పుట్టినరోజు సందర్భంగా తెలిపారు. 


'విడుతలై' తొలి భాగం చిత్రీకరణ పూర్తి అయ్యిందని కొన్ని రోజుల క్రితం నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న చిత్రీకరణ రెండో భాగం కోసం. ఈ సినిమా కోసం కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో పది కోట్ల రూపాయలు విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ వేశామని నిర్మాతలు తెలిపారు. ఆ మధ్య యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకెనాల్‌లో ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బల్గేరియా నుంచి వచ్చిన నిష్ణాతులైన స్టంట్  బృందం అందులో పాల్గొంటున్నారు. 


విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'విడుతలై 1',  'విడుతలై 2' విడుదల తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


'అసుర‌న్‌' వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అంతే స్ట్రాంగ్ కంటెంట్‌తో డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ ‘విడుదలై’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆకట్టుకునే ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి  నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు.