Vijaya Durga Devi Temple: విశాఖలో అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు. పోలీసులు అందరూ రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో ఉండగా అదును చూసిన చోరులు చెలరేగిపోయారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి టైలర్స్ కొలనీలో విజయదుర్గా దేవి ఆలయాన్ని కొల్లగొట్టారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో దుండగులు ఆలయం తాళాలను పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు పుస్తెల తాడు, సూత్రాలతో పాటు హుండీని దొంగిలించారు. దొంగలు బైకు మీద హుండీతో పరారవ్వడాన్ని ఓ స్థానికుడు గమనించి ఆలయ ధర్మకర్తలకు సమాచారం అందించాడు. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవాలయాల్లో చోరీలు నిత్యకృత్యంగా మారడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలల క్రితం విజయవాడ దుర్గ గుడిలో చోరీ
విజయవాడ దుర్గగుడిలో మరోసారి చోరీ జరిగింది. ఏకంగా సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం సంచలనంగా మారింది. హుండీ లెక్కింపులో ఇలా బంగారం దొంగిలించడం... ఆ బంగారాన్ని బాత్రూమ్‌లో దాచిపెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహా మండపం బాత్రూంలో 12 తులాల బంగారాన్ని ఆలయ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీల్లో వెలుగు చూసింది. సోమవారం అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది.
అంతా సజావుగాసాగిందనుకున్న టైంలో పది లక్షల విలువైన బంగారం కనిపించడం లేదని ఆలయాధికారులు గుర్తించారు. మాయమైన బంగారం ఏమై ఉంటుందని అంతా కంగారు పడ్డారు. చివరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి జరిగిన చోరీపై అంతర్గత విచారణ చేపట్టారు. అంతర్గత విచారణలో భాగంగా అన్ని ప్రాంతాలను చెక్ చేశారు. వచ్చిన వారందరిని పిలిచి ఆరా తీశారు. చివరకు పది లక్షల విలువైన బంగారం ఆలయంలోని బాత్ రూంలో గుర్తించారు. అది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. జరిగిన బంగారం చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. దేవస్థానం అధికారులు, మండలి సభ్యులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు.
2020 అక్టోబర్‌లో కూడా దుర్గమ్మ రథానికి ఉండే సింహాలను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇది సుమారు ఏడాది పాటు తీవ్ర సంచలనంగా మారింది. అప్పట్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సుమారు నాలుగు నెలల విచారించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. దుర్గ గుడిని సందర్శించిన సాయిబాబా అనే వ్యక్తి రాత్రివేళలో గోడ దూకి వచ్చి రథానికి ఉన్న సింహాలు ఎత్తుకెళ్లినట్టు చెప్పారు. ఇనుపరాడ్‌తో మూడు సింహాలు పెకిలించి ఎత్తుకెళ్లిపోయాడన్నారు. పదహారు కిలోల బరువు ఉన్న విగ్రహాలను తణుకులో అమ్మేశాడని తెలిపారు. అతనితోపాటు వెండిని కరిగించిన బంగారు వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో వెండి విషయం కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది వెంటనే తెలిసినా ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి. తాత్సారం దేనికి చేస్తున్నారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.