President Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు నేవీ డే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10.30కు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేరుకుంటారు. విజయవాడలో రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అనంతరం గం.11.45 నిమిషాలకు పోరంకిలో రాష్ట్రపతికి పౌరసన్మానం కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి రాకకు గౌరవార్థంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందు ఏర్పాటుచేసింది. ఈ విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. మధ్యాహ్నం గం.2.45 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి విశాఖ వెళ్లనున్నారు. గం. 3.45 లకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగా చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే కార్యక్రమాల్లో నౌకాదళ ప్రదర్శనను రాష్ట్రపతి ముర్ము వీక్షిస్తారు.
వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రక్షణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన పలు ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్‌రేంజ్ ప్రాజెక్టు, కృష్ణా జిల్లా నిమ్మలూరులోని భెల్ ప్రాజెక్టు, రాయచోటి-అంగలూరు మధ్య హైవే, నాలుగు వరుసల ఆర్‌వోబీకి ప్రారంభోత్సవం, కర్నూలు ఐటీసీ జంక్షన్‌లో ఆరు వరుసల స్లిప్ రోడ్, ముదిగుబ్బ-పుటపర్తి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, రాజమహేంద్రవరంలోని ఏకలవ్య మోడల్ స్కూల్, సైన్స్ సెంటర్‌లను రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. విశాఖలో నేవీ డే కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు రాష్ట్రపతి. ఆదివారం రాత్రి తిరుమల పద్మావతి అతిథిగృహంలో బస చేసి, సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. సోమవారం ఉదయం గం.10.40 నిమిషాలకు పద్మావతి కళాశాల విద్యార్థినులతో రాష్ట్రపతి సమావేశం కానున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి దిల్లీ వెళ్లనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
భారత నౌకాదళ దినోత్సవం (నేవీ డే-2022) సందర్భంగా విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 4న రామకృష్ణ బీచ్ రోడ్ లో NTR విగ్రహం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ యుద్ధ విన్యాసాలు జరుపుతున్న కారణంగా ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి, మరికొందరు ప్రముఖులు విశాఖ నగరానికి రానున్నారు. పలువురు ప్రముఖుల పర్యటన, నేవీ డే యుద్ధ విన్యాసాల సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 4న) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ నగర పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను తెలుసుకుని అధికారులకు సహకరించాలని పోలీసులు కోరారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన కారణంగా విజయవాడ ఎయిర్ పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్టును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రపతి మొదటిసారిగా ఏపీ వస్తుండడంతో అన్ని ప్రణాళిక ప్రకారం జరగాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి విజయవాడలో ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతికి పౌరసన్మానం నిర్వహించే ఎం.కన్వెషన్ హాల్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను దారి మళ్లింపు చేశారు.