Weather Latest Update:  ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ పసిఫిక్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన సుమత్రా దీవులకు దగ్గర ఉంది. ఈ ఆవర్తనం బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఆవర్తనం డిసెంబర్ 5వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ తుపాను వల్ల ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. 


మాండస్ తుపాను 


బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, 5న అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత బలం పుంజుకుని వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారుతుందని చెప్పారు. 8న తమిళనాడు, ఉత్తర శ్రీలంకల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుపానుకు మాండస్ గా నామకరణం చేశారు. దీంతో ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లోని బలమైన తుపాను డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు కూడా నిర్థారించారు. అయితే ప్రస్తుతానికి ఏపీకి తుపాను ముప్పు అంతగా లేదంటున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ, విశాఖల్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. 


తెలంగాణ వెదర్ రిపోర్టు ఇలా 


తెలంగాణలో మాత్రం మరో నాలుగు వరకూ వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. చలి తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉందన్నారు.  మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి - కొత్తగూడెం వంటి తూర్పు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగర శివార్లలో విస్తృతంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా హైవేలపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.