Mallikarjun Kharge: 


రెండు పదవుల్లోనూ..


కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే...రాజ్యసభలో ప్రతిపక్ష నేతగానూ కొనసాగనున్నారు. నిజానికి...అధ్యక్ష ఎన్నికకు ముందు అధిష్ఠానం ఓ రూల్ పెట్టింది. ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికైనా..అంతకు ముందు పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు కట్టుబడి...ఖర్గే తన రాజీనామా లేఖను ఇప్పటికే పార్టీకి అందించారు. కానీ..ఇప్పటి వరకూ అధిష్ఠానం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. "కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాదు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగానూ...మల్లికార్జున్ ఖర్గే అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తారు" అని AICC జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలోనూ...ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కొనసాగాలా వద్దా అన్న చర్చ రానే లేదని వెల్లడించారు. "కమిటీ మీటింగ్‌లో ఇలాంటి విషయాలు చర్చించలేం. మా పార్లమెంటరీ పార్టీ చీఫ్ ఏ నిర్ణయం తీసుకుంటే...అదే మేం అనుసరిస్తాం" అని జైరాం రమేష్ తెలిపారు. అక్టోబర్‌లోనే ఖర్గే తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ అయిన సోనియా గాంధీకి అందించారు. అయితే..కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలంతా భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారని, కొందరు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరు కాకపోవచ్చని అంటున్నాయి పార్టీ శ్రేణులు. అందుకే...ఖర్గే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. ఒకవేళ ఖర్గే రాజీనామాకు అధిష్ఠానం ఆమోదం తెలిపితే...ఆయన స్థానంలో దిగ్విజయ్ సింగ్‌, పి. చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ లాంటి సీనియర్ నేతల్ని నియమించాలని భావిస్తున్నారు. ఖర్గే...ఇప్పటికే ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీలోని అంతర్గతంగా ఉన్న విభేదాలను తొలగించడమే లక్ష్యంగా..పూర్తిస్థాయిలో చర్చించన్నారు. 


సమస్యలకు పరిష్కారం..


ఖర్గే పార్టీలోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా...పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు మధ్య ఉన్న ఖాళీని పూరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే "కాంగ్రెస్ జన సంపర్క్" క్యాంపెయిన్‌ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా...కార్యకర్తలకు, నేతలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో నవంబర్ 21న ఉదయం రెండు గంటల పాటు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఖర్గేను అపాయింట్‌ మెంట్‌ లేకుండానే ఎవరైనా నేరుగా వెళ్లి కలిసే అవకాశముంది. రెండు రోజుల పాటు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. గతంలోనూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికైనప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. కానీ...ఆ తరవాత ఆపేశారు. ఈ సారి కూడా ఇదే రిపీట్ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఖర్గే ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. కార్యకర్తల్ని పార్టీకి దగ్గర 
చేయడంపైనా దృష్టి సారిస్తానని వెల్లడించారు. వారి సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. పార్టీకార్యకర్తలెవరైనా తనను నేరుగా వచ్చి కలవొచ్చని చెప్పారు. 


Also Read: Iran Hijab Protest: హిజాబ్‌ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాం, త్వరలోనే మార్పులు - ఇరాన్ అటార్నీ జనరల్