కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం రాజకీయ రంగు పులుముకుంటోంది. పీహెచ్ డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ బాధితులు నిరసనకు దిగారు. గాయపడ్డ విద్యార్థులను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌ అయ్యారు. వరంగల్ సీపీ రంగనాథ్ కేయూ విద్యార్థుల కేసును తప్పుదోవ పట్టించారన్న ఆయన సీపీ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.


షాడో సీఎంలు చెప్పినట్టు వినొద్దని విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. విద్యార్థులను అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్ కాకుండా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోకి ఎందుకు తీసుకెళ్లారని రఘునందన్ ప్రశ్నించారు. విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేంత అవసరం ఏమోచ్చిందని ఆయన సీపీ వ్యవస్థలను ఎందుకు మేనేజ్ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. 


సీపీ రంగనాథ్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్న ఆయన సీపీ రంగనాథ్ పై కోర్టులో కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్యార్థులపై పోలీసుల దాడిని సీరియస్ తీసుకున్న ఆయన ఘటనపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.  విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వీసీపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్ రావు.  


కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టడం మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇప్పటికే ఖండించారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తీసుకెళ్లి కొట్టడం దేశచరిత్రలో ఎక్కడా జరగలేదని విద్యార్థుల దెబ్బలు చూసి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారని అన్నారు. విద్యార్థులను ఇంత దారుణంగా కొట్టించిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని మండిపడ్డారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈటల రాజేందర్.


పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదని ప్రతిభ ఆధారంగానే సీట్ల కేటాయించామన్నారు వీసీ రమేశ్‌. తోపులాటల్లో జరిగిన గాయాలు తప్ప.. పోలీసులు విద్యార్థులను కొట్టలేదని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. నెల రోజుల క్రితం జరిగిన గాయాలకు కట్టుకట్టి పెద్దదిగా చూపిస్తున్నారని మండిపడ్డారు.  తాను ఎవరిని తుపాకీతో బెదరించలేదన్న ఆయన.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.  పోలీసుల దాడిని నిరసిస్తూ 12 విద్యార్థి సంఘాలు.. ఈనెల12 జిల్లా బంద్‌కి పిలుపునిచ్చాయ్. పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు మద్దతు ప్రకటించాయ్.