Kadem Project Repairs Present Situation: గతేడాది భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు (Kadem Project) పెద్ద ముప్పు నుండి బయటపడింది. గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాజెక్టు పై నుంచి వరద నీరు ప్రవహించి ప్రాజెక్టు డ్యామేజ్ కు గురైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో అధికారులు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) ప్రాజెక్టును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వచ్చే వర్షాకాలంలో ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వేసవిలోగా ప్రాజెక్టు గేట్లు ఇతర మరమ్మతులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రస్తుతం కడెం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది..? ప్రాజెక్టుపై ఏం పనులు జరుగుతున్నాయి.? ఈ వేసవిలో కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తవుతాయా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే.

Continues below advertisement


ఇదీ జరిగింది


నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టును 1949 -1965 మధ్యకాలంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారుగా 65 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. 2022 - 2023లో జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాజెక్టు డ్యామేజ్ కు గురైంది. గతేడాది జూలై నెలలో ఏకధాటిగా కురిసిన వర్షాలతో కడెం పూర్తిగా నిండి పోయింది. గేట్లు పనిచేయక ప్రాజెక్టు పై నుంచి వరద నీరు ప్రవహించింది. ప్రాజెక్టు కూలిపోతుందని దిగువ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు హ్యాండిల్ సహాయంతో గేట్లు ఎత్తివేయడంతో వరద ఉద్ధృతి తగ్గి పెను ప్రమాదం తప్పింది. అనంతరం గేటుకు వెల్డింగ్ చేయించి నీటిని అదుపు చేశారు.


ప్రస్తుతం పరిస్థితి ఇదీ


ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు, 7.603 టిఏంసీలు కాగా.. ప్రస్తుతం 677.700 అడుగులకు చేరింది. 3.148 టీఎంసీలుగా ఉంది. రానున్న వేసవిలో నీటిమట్టం మరింతగా తగ్గుముఖం పడనుంది. గతేడాది భారీ వర్షాలతో ప్రాజెక్టు ఎడమ కాలువకు పడిన గండి, పని చేయలేని గేట్లకూ మరమ్మతులు, గేట్ల బయట నుంచి వరద నీరు ప్రవహించే స్పిల్ వే, ఆఫ్రాన్ కొట్టుకుపోవడంతో ఆ పనులు గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఇంజినీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ ప్రాజెక్టును సందర్శించారు. జిల్లా ఇంజినీరింగ్ అధికారులతో ప్రాజెక్టు గేట్లను, కోతకు గురైన కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ, గేట్ల కింద అఫ్రాన్ పనులను పరిశీలించారు. వర్షాకాలంలోగా మరమ్మతులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని, దీనిపై అధికారులతో సమీక్షంచి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. 


ఇవీ మరమ్మతులు


కడెం ప్రాజెక్టు 15వ నెంబర్ గేటు కౌంటర్ వెయిట్ పడిపోవడంతో కొత్త కౌంటర్ వెయిట్, రోలర్ బాక్స్ లను తయారు చేస్తున్నారు. గేటుకు కొత్త కౌంటర్ వెయిట్ తయారు చేస్తున్నామని, దాంతో పాటు రబ్బర్ సీల్, రోలర్, పనులు సైతం పూర్తి చేసి వారం రోజుల్లో ఫిట్ చేస్తామని నిపుణులు తెలిపారు. అయితే, పనులు త్వరగా పూర్తి కావాలని స్థానికులు, రైతులు ఆకాంక్షిస్తున్నారు. వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ వేసవిలోగా గండి పడిన ఎడమ కాలువకు, ప్రాజెక్టుపై మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. 


Also Read: Telangana LRS Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్, క్రమబద్ధీకరణకు ఛాన్స్