TS News : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో టీఆర్ఎస్ వర్గ పోరు రచ్చకెక్కింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల  కార్పొరేషన్ చైర్మన్  సాయి చందు, స్థానిక ఎమ్మెల్యే తనయుడు అజయ్ ఇద్దరి మధ్య స్టేజిపై వాగ్వాదం జరిగింది. వజ్రోత్సవాలు ముగిసిన అనంతరం స్టేజిపై సాయి చందు అభిమానులు తనకు బొకేలు ఇచ్చి  ఫొటోలు దిగుతున్న సందర్భంలో అజయ్ తన అనుచరులతో స్టేజిపై వచ్చి భౌతిక దాడికి దిగారు. అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ సాయి చందుపై దాడికి పాల్పడ్డారు. సాయి చందు చేతికి గాయం కావడంతో ఆయనను అక్కడ నుంచి తరలించారు పోలీసులు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడిన గుండాలను, రౌడీలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


కేటీఆర్ సభలో యువకుడి హల్ చల్ 


తెలంగాణ మంత్రి కేటీఆర్ వేములవాడలో పర్యటిస్తున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు భాగంగా భారీ బందోబస్తు నడుమ సభ జరుగుతుండగా ఓ యువకుడు ఒక్కసారిగా స్టేజి మీదకు వచ్చి కలకలం సృష్టించాడు.  స్టేజిపై కేటీఆర్, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్, బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తోబాటు కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ యువకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో నాయకులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలసులు అతన్ని పట్టుకొని వేదిక కిందికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడు ఇలా ఎందుకు చేశారో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన యువకుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.



విద్యార్థులకు పాచిపోయిన ఆహారం 


జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా  సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు దుర్వాసన వస్తున్న భోజనం అందించారు. వాసన వస్తుండడంతో ఆహారాన్ని కొద్దిగా తిని వదిలేశారు విద్యార్థులు. ఎండలో ర్యాలీలో తిప్పి వారికి పాచిపోయిన ఆహారం పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యత వజ్రోత్సవాలకు ప్రభుత్వం లక్షల్లో డబ్బులు కేటాయించగా స్థానిక నేతల కక్కుర్తి పడి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. దీంతో తేరుకున్న నేతలు, అధికారులు ఆహార పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా డస్ట్ బిన్ లో పడేశారు.  ఎవరి కంటపడకుండా విద్యా్ర్థులను కూడా పంపించేశారు.  ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఎమ్మార్వో సమాధానం ఇవ్వలేదు. 



Also Read : Delhi Liquor Scam: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు, నేడు ఏం తేలనుంది !


Also Read: Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్‌లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా !