Missing Phone CEIR App : పోయిన, చోరీకి గురైన సెల్ ఫోన్ ను గుర్తించేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ నూతన అప్లికేషన్ ను అమల్లోకి తెచ్చింది. ఈ అప్లికేషన్ ను  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి తెలిపారు. పోయిన మొబైల్ ను తిరిగి పొందడానికి CEIR అప్లికేషన్ ఎంతో దోహదపడుతుందని ఎస్పీ జె. సురేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్  కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్లో సిబ్బందికి, అధికారులకు CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER )  అప్లికేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 




ప్రజలకు అవగాహన కల్పించండి


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... చోరీకి గురైనా లేదా పోయిన ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని, కొత్తగా ప్రవేశపెట్టిన ఈ CEIR అనే అప్లికేషన్ ద్వారా ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైనా ఫోన్లను వెతికిపట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు. మొబైల్ ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్ లో లేదా మీ-సేవ ద్వారా ఫిర్యాదుచేయాలని ఎస్పీ సూచించారు. అదే విధoగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో ఆ ఫోన్  వివరాలను  IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలన్నారు. దీంతో  ఆ ఫోన్  స్టేటస్ తెలుస్తుందన్నారు. CEIR  అప్లికేషన్ గురించి పోలీసు అధికారులు సిబ్బంది గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


CEIR యాప్ ఎలా పనిచేస్తుంది


టెలికాం మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR ) యాప్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన ఫోన్ లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడీ, ఓటీపీ (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఫోన్  దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని, CEIR యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.  CEIR యాప్ లో సమాచారం నమోదు చేస్తే పోయిన మొబైల్ ఫోన్ త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.