IPL 2023, IPL 2023:
అర్జున్ తెందూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం తనకో సరికొత్త అనుభూతి అని సచిన్ తెందూల్కర్ అన్నాడు. గతంలో అతడి ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచులో అతడి ప్రదర్శనను డ్రెస్సింగ్ రూమ్ నుంచే చూశానని వెల్లడించాడు. అతడి ప్రణాళికలు మార్చుకోవద్దనే నేరుగా మ్యాచును చూడలేదని స్పష్టం చేశాడు. కోల్‌కతాపై ముంబయి ఇండియన్స్ విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
గతేడాది వేలంలో అర్జున్ తెందూల్కర్‌ను (Arjun Tendulkar) ముంబయి ఇండియన్స్ వేలంలో కొనుగోలు చేసింది. అప్పుడే ఆడిస్తారని అంతా భావించారు. ఒక మ్యాచులో ఆడిస్తారని తెలియడంలో కుటుంబ సభ్యులు వచ్చేశారు. అయితే ఆఖరి క్షణాల్లో ప్లాన్‌లో మార్పు చేశారు. దాంతో అతడి అరంగేట్రం ఈ సీజన్‌కు వాయిదా పడింది. 2008 నుంచి సచిన్ తెందూల్కర్ ముంబయి ఇండియన్స్‌తోనే (Mumbai Indians) ఉన్నాడు. ఆటగాడిగా, మెంటార్‌గా దానికే సేవలు అందిస్తున్నాడు.
'ఇదో భిన్నమైన ఫీలింగ్. ఐపీఎల్‌లో 2008 నా ఫస్ట్ సీజన్. 16 ఏళ్ల తర్వాత నా కొడుకూ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. చాలా బాగుంది. ఇది నాకో భిన్న అనుభూతి. ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ అతడి ఆటను చూడలేదు. స్వేచ్ఛగా బయటకు వెళ్లి తన ఆటేదో తనే ఆడుకోవాలని కోరుకున్నాను. అతడికి నచ్చింది చేసేలా చూశాను' అని సచిన్ అన్నాడు.
'అర్జున్ మైదానంలో ఆడుతుంటే నేను డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నాను. అతడు తన ప్రణాళికల నుంచి దూరం వెళ్లొద్దనే ఇలా చేశాను. మెగా స్క్రీన్‌లో నన్ను చూసి.. నేను అతడి ఆటను గమనిస్తున్నానని తెలిసి ప్లాన్స్ మార్చుకోవడం ఇష్టం లేదు. అందుకే లోపలే ఉన్నాను' అని సచిన్ తెలిపాడు.
ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అర్జున్ అన్నాడు. 'ఇది నాకో గొప్ప మూమెంట్. 2008 నుంచి సపోర్టు చేస్తున్న టీమ్‌కే ఆడటం ఎంతో ప్రత్యేకం. ముంబయి ఇండియన్స్ కెప్టెన్, మేనేజ్‌మెంట్ నుంచి క్యాప్ తీసుకోవడం బాగుంది' అని పేర్కొన్నాడు. ఈ మ్యాచులో అర్జున్ రెండు ఓవర్లు వేసి 8.5 ఎకానమీతో 17 పరుగులు ఇచ్చాడు.