IPL 2023: ఐపీఎల్ -15 ఫైనలిస్టులు  గుజరాత్ టైటాన్స్ -  రాజస్తాన్ రాయల్స్  మధ్య  అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ముగిసిన  హై ఓల్టేజీ  థ్రిల్లర్‌లో సంజూ శాంసన్ సారథ్యంలోని  రాజస్తాన్.. 3 వికెట్ల తేడాతో గెలుచుకుంది.  2022 ఫైనల్‌లో ఇదే వేదికపై తమను ఓడించిన గుజరాత్‌పై గెలిచిన  రాజస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది.  గుజరాత్ నిర్దేశించిన  178 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్తాన్..  55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా  కెప్టెన్ సంజూ శాంసన్,  ఫినిషర్ షిమ్రన్ హెట్‌మెయర్‌ల మెరుపులతో  రాజస్తాన్ స్టన్నింగ్ విక్టరీ అందుకుంది. 


ప్రతీకారం తీర్చుకున్నాం.. : హెట్‌మెయర్‌


మ్యాచ్ ముగిసిన తర్వాత హెట్‌మెయర్‌  పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేఫన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా ఆడానని చెప్పుకొచ్చాడు. హెట్‌మెయర్‌ మాట్లాడుతూ..‘నేను ఈ మ్యాచ్‌ను గెలవాలనే కసితో ఆడాను.  ఎందుకంటే  వీళ్లు (జీటీ)  గత సీజన్‌లో మమ్మల్ని  మూడు సార్లు ఓడించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మాకు చిన్నపాటి  ప్రతీకారం వంటిది.   ఈ  గేమ్ లో మేము చివరి 8 ఓవర్లలో వంద పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు  నా మనసును కూడా అదే విధంగా ప్రోగ్రామ్ చేసుకున్నా..  నేను కేవలం   పరుగులు సాధించడం మీదే దృష్టి పెట్టా...’అని  చెప్పాడు. 


 






2022 సీజన్‌లో ఇలా.. 


హెట్‌మెయర్‌ చెప్పినట్టు  2022 సీజన్‌లో  గుజరాత్ - రాజస్తాన్ లు మూడు సార్లు తలపడగా మూడు మ్యాచ్ లలోనూ  రాజస్తాన్ ఓటమి పాలైంది.   లీగ్ దశలో  ఇరు జట్ల  మధ్య  జరిగిన మ్యాచ్‌లో   గుజరాత్  ఫస్ట్ బ్యాటింగ్ చేసి   192 పరుగులు చేసింది.  ఆ తర్వాత రాజస్తాన్.. 20 ఓవర్లలో  155 పరుగులకే  పరిమితమైంది. ప్లే ఆఫ్స్ చేరిన ఈ ఇరు  జట్లూ.. ఫస్ట్ క్వాలిఫయర్ లో  తలపడ్డాయి.  ఆ మ్యాచ్ లో  కూడా రాజస్తాన్.. 20 ఓవర్లకు 188 పరుగులు చేసింది. కానీ గుజరాత్.. లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలుండగానే బాదేసింది. ఇక ఫైనల్స్‌లో  కూడా  గుజరాత్‌దే పైచేయి.  తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. 130 పరుగులే చేయగా.. రాజస్తాన్ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే సాధించి టైటిల్‌ను గెలిచింది.  


 






నిన్నటి మ్యాచ్‌లో... 


ఆదివారం  గుజరాత్ - రాజస్తాన్ మ్యాచ్‌లో  కూడా  శాంసన్ సేనకు  విజయం అంత ఈజీగా దక్కలేదు.  4 పరుగులకే ఓపెనర్లు  ఔట్ అయిన ఆ జట్టు.. 55కే నాలుగు వికెట్లు కోల్పోయింది.  హెట్‌మెయర్  క్రీజులోకి వచ్చినప్పుడు  12 ఓవర్లకు  రాజస్తాన్ చేసింది  66 పరుగులే. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.  రషీద్ ఖాన్ వేసిన  13వ ఓవర్లో శాంసన్ హ్యట్రిక్ సిక్సర్లు బాదాడు.  తర్వాత హెట్‌మెయర్ కూడా  హిట్టింగ్‌కు దిగాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో హెట్‌మెయర్  ఆకాశమే హద్దుగా చెలరేగాడు.  శాంసన్ నిష్క్రమించినా ధ్రువ్ జురెల్,  అశ్విన్, బౌల్ట్‌ల అండతో 178 పరుగుల లక్ష్యాన్ని  మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించాడు.  ఈ మ్యాచ్‌లో అతడు.. 26 బంతుల్లోనే  2 బౌండరీలు,  5 సిక్సర్లతో   56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.