ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు డా. ధారావత్ నరేంద్ర నాయక్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం (అక్టోబరు 9) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు డా. ధారావత్ నరేంద్ర నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉంటుందని తెలిపారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ "వారాహి యాత్ర" ఖానాపూర్ నియోజకవర్గానికి రానున్నట్లు తెలిపారు. 


యాత్రలో భాగంగా ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకుంటారని, ఆపై నియోకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకుంటారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపురావ్ ఆదిలాబాద్ జిల్లాకు ఏం న్యాయం చేశారని మండిపడ్డారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ములుగు జిల్లాకు కేటాయిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన బిడ్డలు బాగుపడాలని లేదా అని ప్రశ్నించారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గంలోనీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధిని ఆమడ దూరంలో ఉంచాయని, నిరుపేదలకు న్యాయం చేసే దిశగా కృషి చేయాలని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఉట్నూరు కేంద్రంగా గిరిజన యూనివర్సిటీతో పాటు ఎంబీబీఎస్ కళాశాలను ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నివాసం ఉంటున్న గిరిజనులతో పాటు గిరిజనేతరుల పోడు భూములకు, ఇళ్లకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లుగా ఏజెన్సీ ఏర్పడక ముందు నుంచి గిరిని ఇతరుల సైతం నివసిస్తున్నారని గిరిజనులకు న్యాయం చేసే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనాథ్, శ్రీకాంత్, దేవిదాస్, హనుమంతు, ప్రవీణ్, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.