ఇటీవల అమెరికాలో పర్యటించిన ఏపీ ప్రభుత్వ విద్యార్థుల బృందం ముఖ్యమంత్రి జగన్‌ను నేడు కలిశారు. అమెరికా పర్యటన ఎలా జరిగిందని సీఎం పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు అధికారులు కూడా వెంట ఉన్నారు. వరల్డ్ బ్యాంక్‌, ఐఎంఎప్‌, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో వీళ్లు పాల్గొన్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను 126 మందిని గుర్తించి వారికి పోటీ పరీక్ష నిర్వహించామని, వారి భాషా పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించి చివరకు 10 మందిని ఎంపికచేశామని అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. నాడు – నేడు కార్యక్రమంతో మా స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని విద్యార్థులు పేర్కొన్నారు. తాము స్వేచ్ఛ కార్యక్రమం గురించి మాట్లాడగానే వివిధ దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపారని వెల్లడించారు. డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుందని అన్నారు.


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘అమెరికా పర్యటన ద్వారా మీరు గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాం మీద కొన్ని అనుభవాలు నేర్చుకున్నారు. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎలా నిలబడాలి అన్నదానిమీద మీకు కొన్ని అనుభవాలు ఈ పర్యటన ద్వారా వచ్చి ఉంటాయని భావిస్తున్నాను. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారతాయి. దీనికి విద్యే ఆధారం. మనం జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు చేస్తున్నాం. మీరు చూసిన కొలంబియా యూనివర్శిటీ లాంటి చోట్ల 21 కోర్సులు ఇచ్చే అన్ని ప్రఖ్యాత ప్రపంచ కాలేజీల్లో కూడా మీకు ఎక్కడ సీటు వచ్చినా ఉచితంగా చదివిస్తాం.


అందులో సీటు వస్తే రూ.1.2 కోట్ల ఫీజు 
విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద మీకు సీటు వస్తే చాలు రూ.1.2 కోట్ల వరకూ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం తర్వాత మీరు బయటకు వచ్చాక మీలో ఒక విద్యార్థి ఆశించినట్టుగా సీఈఓలుగా ఎదుగుతారు. ప్రతిభ, నైపుణ్యాలు ఇలాంటి కాలేజీల ద్వారా మీకు అలవడతాయి. అప్పుడు జీవితాలు అన్నవి మారుతాయి. మీకు ఎలాంటి సబ్జెక్టుమీద శ్రద్ధ ఉందో గమనించుకుని, సంబంధిత ప్రపంచస్థాయి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, అందులో సీటు కావాలంటే ఏరకంగా సన్నద్ధం కావాలన్న విషయాల్లో మీ ఆలోచనల్లో ఉండాలి. జీఆర్‌ఈ, జీ మ్యాట్‌ లాంటి పరీక్షలు కూడా ప్రభుత్వ విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం. 


ప్రతి విద్యార్థినీ చేయిపట్టి నడిపించడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడం అన్నది ఈ పిల్లల లక్ష్యం కావాలి. అక్కడ సీటు సంపాదించి చదువులు పూర్తిచేసిన తర్వాత వారి జీవితాల్లో చక్కటి మార్పులు వస్తాయి. టెన్త్‌ నుంచి ట్రిపుల్‌ ఐటీ సీటు రావడం అన్నది మీ డ్రీం. అది నిజం అయ్యింది. ఇప్పుడు ట్రిపుల్‌ ఐటీ నుంచి కొలంబియా లాంటి యూనివర్శిటీ లాంటి గొప్ప యూనివర్శిటీల్లో సీటు సాధించడం అన్నది తదుపరి డ్రీం కావాలి. ఇది సాకారమైతే మీ బతుకులు మారడమే కాదు, మీ కుటుంబాల బతుకులు మారడమే కాదు, రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారు అవుతారు. 


అంతేకాకుండా మీ స్థాయిలో మరో పదిమందికి సహాయపడతారు. ఈ విద్యార్థులకు నిరంతరం చేయూతనందించడానికి ప్రత్యేక అధికారిని నియమించి… వారిద్వారా మార్గనిర్దేశం చేయండి. మన పాఠ్యప్రణాళికలోలేని 1800 సబ్జెక్టులను మన పాఠ్యప్రణాళికల్లోకి తీసుకు వస్తున్నాం. ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి యూనివర్శిటీ నిపుణులచే తయారు చేయబడిన సబ్జెక్టులను ఇందులోకి తీసుకువస్తున్నాం. ఎడెక్స్‌తో దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సులను చేసిన వారికి జాయింట్‌ సర్టిఫికెషన్‌ కూడా లభిస్తుంది. బయట ప్రపంచం చూసినప్పుడు మరింతగా కష్టపడాలన్న స్పూర్తి మీలో కలుగుతుంది. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని సీఎం విద్యార్థఉలతో అన్నారు.