Pawan Kalyan : తెలంగాణలో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగిత్యాలలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక ఆశయం కోసం తాను పోరాడుతున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, ఇక్కడి ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. తెలంగాణలో పరిమిత సంఖ్యలో 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుతుంటున్నానన్నారు. కనీసం 10 మంది అసెంబ్లీలో ఉండాలన్నారు. పొత్తు పెట్టుకుంటే కూర్చొని మాట్లాడుకుని వాళ్లకు సపోర్టు చేస్తానని చెప్పారు.
జనసేన తెలంగాణ నేలపై పుట్టిన పార్టీ
"వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం టైంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను తీసుకున్నారు. ఓ తల్లి నా వద్దకు వచ్చి తన గోడు చెప్పుకుంది. ఆ ఘటనలు చూసి వేదనతో గట్టిగా గళం విప్పాను. తెలంగాణకు స్వాతంత్ర్యం నుంచి సాధన వరకు పోరాటాలు చేసింది ప్రజలు. దేశం మొత్తం స్వాతంత్ర్యం వచ్చి వేడుకలు చేసుకుంటున్నప్పుడు తెలంగాణ రజాకార్ల కబాందాల్లో ఉండిపోయింది. నేను యుత్ వింగ్ లో ఉన్నప్పటి నుంచి తెలంగాణ యువతలో పోరాట స్ఫూర్తిని చూశాను. జనసేన తెలంగాణ నేలపై పుట్టిన పార్టీ. మూడు దశాబ్దాల్లో రాజకీయాలు చేసిన నేతలు ఉన్నారు. వాళ్లకు ఎక్కడకు వెళ్లిన ప్లేస్ ఉంటుంది. నేను మాత్రం వెతికేది అట్టడుగు వర్గాల్లో ఉన్న కోహినూర్ వజ్రాలను. అందరూ పేరున్న నాయకులను తీసుకుంటారు. కానీ నేను అలా కాదు కొత్త నాయకత్వాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏదో సాధించాలని ముందుకు వెళ్తుంది. అందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఏపీలో అలా కాదు ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నవాళ్లే. జనసేన అలా కాదు అందరూ కొత్తవాళ్లే." - పవన్ కల్యాణ్
7 నుంచి 14 స్థానాల్లో పోటీ
"ప్రజాక్షేత్రంలో ఉండే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. కానిస్టేబుల్ అభ్యర్థులు చెబుతున్నారు, ఫిజికల్ టెస్ట్ ల మెజర్మెంట్స్ మార్చేశారని, దీని వల్ల లక్షల మందికి అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. చిన్నపాటి ఉద్యోగాలకు ఇన్ని టెస్టులు పెడుతున్నారు మరి ఇంత పెద్ద నాయకత్వానికి ఎన్ని టెస్ట్ లు ఉంటాయి. అందుకే నేను ఇన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నాను. జనసేనలో ఉంటే వ్యక్తులు చిన్న స్థాయిలో వ్యక్తులు కానీ ఒక ఆశయం కోసం పోరాడేవాళ్లు. తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి నేను నేర్చుకుంటున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను విత్ డ్రా చేయమన్నందుకు చాలా మందికి ఆగ్రహం ఉండొచ్చు. కానీ పెద్ద స్థాయిలో పోరాటం చేయాలనే ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు చాలా మంది నీకెందుకు పార్టీ, అన్నీ గొడవలు, విమర్శలు అన్నారు. నేను అలా అనుకునేవాడ్ని కాదు. సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. అవసరమైతే వీధిపోరాటాలకు సిద్ధం. వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో పోటీ చేద్దాం. ఎవరైన పొత్తుకు వస్తే సంతోషం. మన భావజాలానికి దగ్గరగా ఉంటే పొత్తుకు రెడీ. అది బీజేపీ అయినా సరే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విత్ డ్రా చేయమనడానికి కారణం, సరైన పునాది లేకుండా పోటీ చేయడం సరికాదు అనిపించింది. ఈసారి పరిమిత స్థానాల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో పోటీ చేద్దాం. ఈగో కోసం పొలిటికల్ గేమ్స్ ఆడకూడదు. తెలంగాణ సాధన కోసం వందల మంది యువకులు చనిపోయారు. చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడడు ఏంటని కొందరు అనుకుంటారు. నేను ఒక మాట అనేస్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడతారని తగ్గి మాట్లాడతాను అంతే. ఏపీలో కులాల గీతల మధ్య రాజకీయం చేయాలి. ఏపీపై ఎందుకు దృష్టిపెడుతున్నావని అడుతున్నారు, ఏపీ అభివృద్ధి చెందకపోతే తెలంగాణ యువతకు నష్టం జరుగుతుంది. అక్కడి నుంచి వలసలు రావడంతో ఇక్కడి యువత ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. అందుకే నేను ఏపీపై దృష్టి పెడుతున్నాను. కానీ ఇప్పటి నుంచి తెలంగాణపై కూడా దృష్టిపెడతాను." - పవన్ కల్యాణ్