YS Sharmila : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం షుగర్స్ వద్ద వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహా ధర్నా చేపట్టారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ... నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామంటూ కేసీఆర్ ఉద్యమ సమయంలో ఊదరగొట్టారని విమర్శించారు. 100 రోజుల్లో తెరుస్తామంటూ మాట కూడా ఇచ్చారని, ఇప్పటి ఎన్ని వందల రోజులు అయ్యాయని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా నిజాం షుగర్స్ తెరిపిస్తామంటూ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీ తెరిపించకపోతే ఈ ఫ్యాక్టరీ గేటుకు ఉరి వేసుకుంటా అని చెప్పారన్నారు. బీజేపీ ఎంపీ కూడా నిజాం షుగర్స్ పరిశ్రమను తెరిపిస్తా అంటూ మోసం చేశారన్నారు. సొంత ఖర్చుతో ఫ్యాక్టరీ నడిపిస్తా అన్నారని గుర్తుచేశారు.
వీళ్లు మోసగాళ్లు
"ఒక్కరికైనా మాట మీద నిలబడే తత్వం లేదు. ఒక్కరైనా మాట నిలబెట్టుకోవాలని సోయి కూడా లేదు. వీళ్లా నాయకులు వీళ్లు మోసగాళ్లు దుర్మార్గులు. చెరుకు పంట మొత్తం నిజాం షుగర్స్ మీద ఆధారపడి ఉంది. ఇది చెరుకు రైతుల ఆందోళన. లక్షా 20 వేల ఎకరాల్లో చెరుకు పండేది. ఇప్పుడు కేవలం 10 వేల ఎకరాలకు పంట తగ్గిపోయింది. మూడు ఫ్యాక్టరీలు ఒకేసారి మూసేశారు. కేసీఆర్ మొత్తం ప్రభుత్వ పరం చేస్తామని ఇచ్చిన హామీ ఏమయ్యింది. కనీసం ప్రైవేట్ పరం కూడా చేయలేదు. చంద్రబాబు 2002లో ఓ బడా వ్యాపారికి ఇచ్చారు. అప్పుడే ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. 5 ఏళ్లలో 100 శాతం ప్రైవేటీకరణ అయ్యేలా చంద్రబాబు మోసం చేశారు. "- వైఎస్ షర్మిల
ఎన్ని 100 రోజులు
వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ ఆపివేశారని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్ ప్రభుత్వపరం చేద్దాం అనుకున్నారని, 2006లో మాజీ మంత్రి రత్నాకర్ రావుతో కమిటీ వేశారన్నారు. 2008లో మాజీ మంత్రి కమిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ప్రైవేటీకరణ అనేది పెద్ద కుంభకోణమని కమిటీ రిపోర్ట్ లో ఉందన్నారు. నిజాం షుగర్స్ వెనుక భూకుంభకోణం దాగి ఉందని రిపోర్ట్ ఇచ్చారన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే నిజాం షుగర్స్ పూర్తిగా ప్రభుత్వ పరంగా నడిచేదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ సైతం పట్టించుకోలేదని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ 100 రోజుల్లో పరిశ్రమ ఓపెన్ చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. కేసీఆర్ కూడా ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. సీఎం అయ్యాక నిజాం షుగర్స్ ను తెరిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
నష్టాలు వస్తే ప్రభుత్వం భరించలేదా?
"గత 7 ఏళ్లుగా చెరుకు రైతులు ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇప్పుడు రైతులు నడుపుకోండి అంటూ కొత్త సిద్ధాంతం చెప్తున్నారు. ఇదెక్కడి న్యాయం కేసీఆర్ గారు. రైతులు ఎలా నడుపుతారు ప్రభుత్వానికి నడపడం చేతకానిది రైతులకు చేతన అవుతుందా? మహారాష్ట్ర వెళ్లి అధ్యయనం చేసి రండి అంటూ పంపారట. అక్కడ పరిస్థితులకు ఇక్కడ పరిస్థితులకు పూర్తిగా భిన్నం. మహారాష్ట్రలో ఎకరాకు 80 టన్నుల చెరుకు పండుతుంది. ఇక్కడ 40 టన్నుల కూడా పండటం లేదు కదా. అక్కడ చెరుకుతో చెక్కర పాటు ఇతర అంశాలకు ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీలలో అంత సీన్ లేదు. నిజాం షుగర్స్ లో 49 శాతం ప్రభుత్వ వాటా ఉంది. 49 శాతం ఉంటే కేసీఆర్ ఎందుకు నడపడం లేదు? నష్టాలు వస్తే ప్రభుత్వం భరించలేదా? షుగర్ ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగులు ఆందోళన చెందవద్దు. YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాం." - వైఎస్ షర్మిల