తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మార్చాలని సోనియా, రాహుల్ గాంధీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకుని వెళ్లడం లేదని.. ఒంటెత్తు పోకడలకు పోతున్నారని.. టీ పీసీసీ చీఫ్ తన విధాలను మార్చుకోవాలని.., లేకపోతే ఆయనను మార్చాలని లేఖలో జగ్గారెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి సోమవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని.. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ తనతో చర్చించకుండా.. అసలు పార్టీలో చర్చించకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను వెళ్లబోవడం లేదన్నారు. తన అసంతృప్తిని హైకమాండ్‌కు తెలియచేస్తానన్నారు.
Also Read: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?
అన్నట్లుగానే జగ్గారెడ్డి సాయంత్రానికి హైకమాండ్‌కు లేఖ రాశారు. నిజానికి జగ్గారెడ్డి మొదటి నుంచి అసంతృప్త వాదిగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి అంశంలో ఆయన మొదటి నుంచి సానుకూలంగా లేరు. గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా సభ సమయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సారి తనకు చెప్పకుండానే క్రికెట్ మ్యాచ్ నిర్వహించారని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో.. ఫలితాలు వస్తున్న సమయంలోనే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చే్యడంతో సారీ కూడా చెప్పారు. ఇక బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయబోనన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని జగ్గారెడ్డి మొదటి నుంచి వ్యతిరేకించారు. ఆయనకు పదవి ఇవ్వవొద్దని పలుమార్లు ఆధిష్టానానికి చెప్పారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డికి పదవిని హైకమాండ్ ఇచ్చింది. అయితే జగ్గారెడ్డికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. అంతా కలసి పని చేస్తామని మొదట్లో చెప్పిన ఆయన... తర్వాత రేవంత్ రెడ్డి కలుపుకుని పోవడం లేదని అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో తరచూ వ్యతిరేకంగా మాట్లాడి హైలెట్ అవుతున్నారు.